దారుణం.. పిల్లలు తినే భోజనంలో పాము..!
ABN , Publish Date - May 08 , 2026 | 11:25 AM
బిహార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కలుషిత మధ్యాహ్న భోజనం తిని 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. సహర్సా జిల్లాలోని బలువాహా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
పాట్నా, మే 8: బిహార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కలుషిత మధ్యాహ్న భోజనం తిని 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. సహర్సా జిల్లాలోని బలువాహా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మొదట ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తర్వాత 115 మంది విద్యార్థులను సదర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో 50 మంది విద్యార్థులను మహిషి పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు.
పప్పులో పాము..
బలువాహాలోని ప్రభుత్వ పాఠశాలకు ఓ ఎన్జీఓ సంస్థ మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. స్కూలు సిబ్బంది ఎన్జీవో పంపిన భోజనాన్ని గదిలో భద్రపరిచి పిల్లలకు వడ్డిస్తారు. పప్పు ఉన్న పాత్రలో తాము చనిపోయిన పాము పిల్లని చూశామని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. స్కూల్లో 545 మంది విద్యార్థులు ఉన్నారని, పప్పులో పాము పిల్లని గుర్తించకముందే 200 మంది విద్యార్థులు భోజనం చేశారని చెబుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలపై జిల్లా మేజిస్ట్రేట్ స్పందించారు. ఫుడ్ శాంపిల్స్‌ను వైద్య పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించారు.
వైరల్ ఫొటోపై దర్యాప్తు..
పప్పులో పాము పిల్ల ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది బలుహహా స్కూలుకు సంబంధించిన ఫొటో అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఎస్డీఎమ్ శ్రేయాన్ష్ తివారీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చూడండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోపై దర్యాప్తు చేస్తున్నాం. అది నిజమా లేక ఫేకా అన్నది మేము తేలుస్తాం. ఎన్జీఓ సంస్థనుంచి చాలా స్కూళ్లకు ఆహారం వెళుతుంటుంది. ఆహారం అంతా ఒకే ప్రదేశంలో తయారు చేస్తారు. కానీ, మిగిలిన స్కూళ్లలో ఇలాంటి దేమీ జరగలేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
బలం నిరూపించుకున్న వారికే ఛాన్స్.. తమిళనాడు రాజ్‌భవన్ వర్గాలు
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. భారీగా వెండి ఆభరణాల అపహరణ