బలం నిరూపించుకున్న వారికే ఛాన్స్.. తమిళనాడు రాజ్‌భవన్ వర్గాలు
ABN , Publish Date - May 08 , 2026 | 11:16 AM
సంఖ్యాబలం నిరూపించుకున్న వారికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కుతుందని తమిళనాడులో రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అత్యధిక అసెంబ్లీ సీట్లను (108) గెలుచుకున్నా మ్యాజిక్ ఫిగర్‌ను (118) చేరుకోలేక ప్రభుత్వ ఏర్పాటు కోసం నానా తంటాలూ పడుతోంది. తాము ఫ్లోర్ టెస్టుకు సిద్ధమని కూడా టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తమకు ఉందని నిరూపించుకున్న పార్టీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌పై కేంద్రం ఒత్తిడి ఉందన్న వార్తలను కూడా సంబంధిత వర్గాలు తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తేల్చి చెప్పాయి.
ఇక ప్రజాబలం విజయ్‌కే ఉందనేది తమ అభిప్రాయమని సీపీఎం నేత సుభాషినీ అలీ అన్నారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా టీవీకే అవతరించిందని గుర్తు చేశారు. ఆనవాయితీ ప్రకారం, ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీని గవర్నర్ అసెంబ్లీలో బలనిరూపణ కోసం ఆహ్వానించాలని తేల్చి చెప్పారు. కానీ ఈ విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఇక టీవీకే మద్దతుదారుడు ఒకరు చెన్నైలో లోక్‌భవన్ ఎదుట నిరసనకు దిగారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రాజీనామా చేయని మమతా బెనర్జీ.. రాజ్యాంగం ఏం చెబుతోందంటే..?
విమానంలో టీఎంసీ మహిళా ఎంపీకి చేదు అనుభవం.. ఇండిగోకు ఫిర్యాదు..