రాజీనామా చేయని మమతా బెనర్జీ.. రాజ్యాంగం ఏం చెబుతోందంటే..?
ABN , Publish Date - May 08 , 2026 | 10:30 AM
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై రాజ్యాంగం ఏం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం..
కోల్‌కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు గురువారం నాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్.ఎన్.రవి రద్దు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(బి) ప్రకారం రాష్ట్ర శాసనసభను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. 2026 మే 7 నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయని గవర్నర్ ప్రకటించారు.
రాజ్యాంగం ఏం చెబుతోంది..?
అసెంబ్లీ రద్దు అయిన వెంటనే దాని పదవీకాలం ముగుస్తుందని 'విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ'కి చెందిన రాజ్యాంగ నిపుణుడు స్వప్నిల్ త్రిపాఠి తెలిపారు. అసెంబ్లీతోపాటు రాష్ట్ర మంత్రివర్గ రాజ్యాంగబద్ధ స్థితి కూడా ముగుస్తుందని ఆయన వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి కేవలం తాత్కాలిక లేదా ‘కేర్ టేకర్’ హోదాలో మాత్రమే కొనసాగే అవకాశం ఉందని త్రిపాఠి పేర్కొన్నారు. అది కూడా గవర్నర్ ఆహ్వానం మేరకే జరుగుతుందని చెప్పారు. ఇది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న నిబంధన కాదని.. కేవలం సంప్రదాయబద్ధంగా వస్తున్న విధానం మాత్రమే అని తెలిపారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా రాజ్యాంగబద్ధ పరిస్థితిలో ఏ విధమైన మార్పు ఉండదని స్పష్టం చేశారు. కాబట్టి మమత బెనర్జీ రాజీనామా చేయకపోయినా సాధారణ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేదని త్రిపాఠి తేల్చి చెప్పారు.
ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలుంటే..?
ఎన్నికల ప్రక్రియ లేదా ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే వాటిని చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. దానిపై ఎన్నికల పిటిషన్ రూపంలో హైకోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం సంబంధిత నియోజకవర్గాల ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి చట్ట ఉల్లంఘనలు జరిగాయని నిరూపించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఇప్పటికే మమతా బెనర్జీ నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ముంబై ఫ్యామిలీ అనుమానాస్పద మృతి.. పుచ్చకాయలో బయటపడ్డ ఎలుకల మందు..
విమానంలో టీఎంసీ మహిళా ఎంపీకి చేదు అనుభవం.. ఇండిగోకు ఫిర్యాదు..