ఐపీఎల్ 2026: పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్
ABN , Publish Date - May 08 , 2026 | 10:43 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్(111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా మార్ష్ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(గురువారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్(111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా మార్ష్ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు. లఖ్‌నవూ తరఫున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్ రికార్డు సృష్టించాడు.
మార్ష్ 49 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇందులో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. గతంలో లఖ్‌నవూ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ కెప్టెన్ రిషబ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో బెంగళూరుపైనే పంత్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును మార్ష్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో మార్ష్‌కు ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ కూడా లఖ్‌నవూ తరఫునే సాధించడం విశేషం. 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులు సాధించాడు.
ఇక లఖ్‌నవూ తరఫున రెండు సెంచరీలు సాధించిన రెండో ప్లేయర్‌గా మార్ష్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... 9 పరుగుల తేడాతో లఖ్‌నవూ.. బెంగళూరుపై విజయం సాధించింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత ఈ విజయం ఎల్ఎస్‌జీకి ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ విజయంతో లఖ్‌నవూ సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో లక్ష్యాన్ని 213 పరుగులకు సవరించగా ఛేదనలో ఆర్సీబీ తడబడింది. 6 వికెట్లకు 203 పరుగులే చేయగలిగింది.
ఇవి కూడా చదవండి: