మార్ష్ శతక మోత
ABN , Publish Date - May 08 , 2026 | 02:28 AM
డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉత్కంఠ విజయం. ఓపెనర్ మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111) తుఫాన్ శతకానికి తోడు...
నేటి మ్యాచ్
ఢిల్లీ X కోల్‌కతా
వేదిక ఢిల్లీ రా.7.30
ఆర్‌సీబీకి లఖ్‌నవూ ఝలక్
లఖ్‌నవూ: డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉత్కంఠ విజయం. ఓపెనర్ మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111) తుఫాన్ శతకానికి తోడు బౌలర్లు సమష్ఠిగా రాణించారు. దీంతో వర్షప్రభావిత ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై లఖ్‌నవూ డక్‌వర్త్ లూయిస్ పద్థతిన 9 పరుగుల తేడాతో నెగ్గింది. సరిగ్గా నెల రోజుల తర్వాత పంత్ సేన మూడో విజయం రుచి చూడడం గమనార్హం. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ముందుగా లఖ్‌నవూ 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 38), పంత్ (10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్) రాణించారు. ఛేదనలో బెంగళూరు లక్ష్యాన్ని 213 పరుగులుగా నిర్దేశించారు. అయితే, బెంగళరు 19 ఓవర్లలో 203/6 స్కోరుకే పరిమితమై ఓడింది. కెప్టెన్ రజత్ పటీదార్ (31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 61), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40), దేవ్‌దత్ పడిక్కళ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) ఫర్వాలేదనిపించారు. ప్రిన్స్ 3, షాబాజ్ 2 వికెట్లు తీశారు. మార్ష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.

పటీదార్ పోరాడినా..: భారీ ఛేదనలో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ఆశించిన రీతిలో సాగలేదు. ఓపెనర్లు బెథెల్ (4), విరాట్ కోహ్లీ (0) తొలి రెండు ఓవర్లలోనే వెనుదిరిగారు. అయితే కెప్టెన్ రజత్ పటీదార్, దేవ్‌దత్‌తో పాటు చివర్లో డేవిడ్ తమ ఆటతీరుతో విజయంపై ఆశలు రేకెత్తించారు. పవర్‌ప్లేలో 45/2 స్కోరుతో జట్టు వెనుకబడినా.. ఆ తర్వాత రజత్ వేగం పెంచాడు. ఏడో ఓవర్‌లో 6,4 బాదిన అతను దిగ్వే్‌షను లక్ష్యంగా చేసుకుని 9వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో జోరు చూపాడు. అలాగే మయాంక్ ఓవర్‌లోనూ రెండు సిక్సర్లతో 26 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఈ దశలో ఆర్‌సీబీ వైపు మ్యాచ్ మొగ్గు చూపింది. కానీ 11వ ఓవర్‌లో దేవ్‌దత్‌ను పేసర్ ప్రిన్స్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. జితేశ్ (1)ను కూడా ప్రిన్స్ అవుట్ చేయగా.. ఆ వెంటనే రజత్‌ను స్పిన్నర్ షాబాజ్ అవుట్ చేయడంతో ఆర్‌సీబీ లయ తప్పింది. అయితే డేవిడ్ భారీషాట్లకు లఖ్‌నవూ శిబిరంలో కాస్త ఆందోళన కనిపించింది. ఈస్థితిలో డేవిడ్‌ను షాబాజ్ 16వ ఓవర్‌లో అవుట్ చేశాడు. కానీ క్రునాల్ (28 నాటౌట్), షెఫర్డ్ (23 నాటౌట్) పట్టు వీడకపోవడంతో చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమయ్యాయి. 6 బంతుల్లో దిగ్వేష్ 10 పరుగులే ఇవ్వడంతో లఖ్‌నవూ సంబరాల్లో మునిగింది.
మార్ష్ వీరంగం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆర్‌సీబీ బౌలర్లను లక్ష్యంగా చేసుకొని బౌండరీలతో హోరెత్తించాడు. అతడికి తోడు నికోలస్ పూరన్, చివర్లో కెప్టెన్ పంత్ సహకరించడంతో లఖ్‌నవూ పటిష్ఠమైన స్కోరందుకుంది. మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (17) ప్రేక్షక పాత్రకే పరిమితం కాగా.. మార్ష్ మాత్రం ఒంటి చేత్తో స్కోరును పరిగెత్తించాడు. ఏ బౌలర్‌నూ వదలకుండా ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగడంతో 20 బంతుల్లోనే తన ఫాస్టెస్ట్ ఐపీఎల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులతో నిలిచింది. అప్పటికి అర్షిన్ చేసింది 8 పరుగులే. ఇక, రెండోసారి వర్షం అంతరాయం కలిగించాక, మ్యాచ్ ఆరంభమైన వెంటనే అర్షిన్‌ను క్రునాల్ అవుట్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మార్ష్ మాత్రం ధాటిని కొనసాగిస్తూ 14వ ఓవర్‌లో 4,4,4,6తో 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అనంతరం మరోసారి వర్షంతో మ్యాచ్‌కు 25 నిమిషాల ఆటంకం ఏర్పడింది. అయితే మ్యాచ్ మొదలైన కాసేపటికే మార్ష్ సూపర్ షోకు హాజెల్‌వుడ్ బ్రేక్ వేశాడు. పూరన్‌తో రెండో వికెట్‌కు మార్ష్ 70 రన్స్ జోడించాడు. ఇక పంత్ వచ్చీ రాగానే బ్యాట్ ఝుళిపిస్తూ 17వ ఓవర్‌లో 4,4,6తో చెలరేగాడు. చివరి ఓవర్‌లో పూరన్ వెనుదిరిగినా.. పంత్ ఆఖరి 3 బంతులను 4,4,6గా మలిచి జట్టు స్కోరును 200 దాటించాడు.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: మిచెల్ మార్ష్ (సి) బెథెల్ (బి) హజెల్‌వుడ్ 111, అర్షిన్ (సి) పటీదార్ (బి) క్రునాల్ 17, పూరన్ (సి) క్రునాల్ (బి) రసిఖ్ 38, పంత్ (నాటౌట్) 32, మార్‌క్రమ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19 ఓవర్లలో 209/3; వికెట్ల పతనం: 1-95, 2-165, 3-194; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-34-0, హాజెల్‌వుడ్ 4-0-49-1, క్రునాల్ 4-0-31-1, రసిఖ్ 4-0-53-1, సుయాశ్ 2-0-21-0, షెఫర్డ్ 1-0-16-0.
బెంగళూరు: బెథెల్ (సి) ప్రిన్స్ (బి) షమి 4, కోహ్లీ (బి) ప్రిన్స్ 0, పడిక్కళ్ (సి అండ్ బి) ప్రిన్స్ 34, పటీదార్ (సి) మార్‌క్రమ్ (బి) షాబాజ్ 61, జితేశ్ (సి) పంత్ (బి) ప్రిన్స్ 1, డేవిడ్ (సి) దిగ్వేశ్ (బి) షాబాజ్ 40, క్రునాల్ (నాటౌట్) 28, షెఫర్డ్ (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 19 ఓవర్లలో 203/6; వికెట్ల పతనం: 1-9, 2-9, 3-104, 4-106, 5-112, 6-158; బౌలింగ్: షమి 4-0-33-1, ప్రిన్స్ 4-0-33-3, యమాంక్ 4-0-50-0, దిగ్వేశ్ 4-0-50-0, షాబాజ్ 3-0-33-2.

ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా