Share News

మార్ష్‌ శతక మోత

ABN , Publish Date - May 23 , 2025 | 05:18 AM

వరుసగా నాలుగు ఓటములతో ప్లేఆ్‌ఫ్సకు దూరమైన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఎట్టకేలకు అదరగొట్టింది. పట్టికలో అగ్రస్థానాన కొనసాగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ను వారి సొంతగడ్డపైనే దీటుగా ఎదుర్కొంది...

మార్ష్‌ శతక మోత

నేటి మ్యాచ్‌

బెంగళూరు X హైదరాబాద్‌

వేదిక : బెంగళూరు, రా.7.30 నుంచి

  • లఖ్‌నవూ ఘనవిజయం

  • పూరన్‌ హాఫ్‌ సెంచరీ

  • గుజరాత్‌కు ఝలక్‌

  • రాణించిన షారుక్‌

అహ్మదాబాద్‌: వరుసగా నాలుగు ఓటములతో ప్లేఆ్‌ఫ్సకు దూరమైన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఎట్టకేలకు అదరగొట్టింది. పట్టికలో అగ్రస్థానాన కొనసాగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ను వారి సొంతగడ్డపైనే దీటుగా ఎదుర్కొంది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 117) తొలి శతకం సాధించగా.. పూరన్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఆ తర్వాత బౌలర్లు కూడా కట్టడి చేయడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్‌ సేన 33 పరుగుల తేడాతో టైటాన్స్‌ను మట్టికరిపించింది. అటు గుజరాత్‌కిది కేవలం నాలుగో ఓటమి కాగా.. లఖ్‌నవూ ఆరు విజయాలు, 12 పాయింట్లతో కాస్త మెరుగైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ (36) సహకరించాడు. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. షారుక్‌ (57), రూథర్‌ఫోర్డ్‌ (38), గిల్‌ (35), బట్లర్‌ (33) రాణించారు. ఓరౌర్కీకి 3, అవేశ్‌.. బదోనిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మార్ష్‌ నిలిచాడు. ఇదిలావుండగా క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా గుజరాత్‌ జట్టు లావెండర్‌ రంగు జెర్సీలతో బరిలోకి దిగింది.


షారుక్‌ పోరాడినా..: గుజరాత్‌ బ్యాటింగ్‌ బలమంతా టాపార్డర్‌పైనే ఆధారపడి ఉంటుంది. కానీ 236 పరుగుల కష్టసాధ్యమైన ఛేదనలో వీరంతా ఓ మాదిరి స్కోరుకే పరిమితమయ్యారు. ఒక్కరు కూడా హాఫ్‌ సెంచరీ సాధించకపోగా.. తొలి పది ఓవర్‌లోనే ఈ త్రయాన్ని పెవిలియన్‌కు చేర్చి లఖ్‌నవూ బౌలర్లు పైచేయి సాధించారు. అయితే ఈసారి మిడిలార్డర్‌ ఆదుకునే ప్రయత్నం చేయగలిగింది. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ ఫోర్‌గా మలిచాడు. అటు మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ గిల్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో ధాటిని కనబర్చాడు. సాయిని పేసర్‌ ఓరౌర్కీ పెవిలియన్‌కు చేర్చగా.. బట్లర్‌ ఆరో ఓవర్‌లో 4,6,6,4తో 21 పరుగులు రాబట్టి పవర్‌ప్లేను 67/1తో ముగించాడు. కానీ స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరడంతో టైటాన్స్‌ షాక్‌కు గురైంది. ఇక కష్టమే అనుకున్న వేళ మిడిలార్డర్‌లో రూథర్‌ఫోర్డ్‌-షారుక్‌ జోడీ నుంచి ప్రతిఘటన ఎదురైంది. నాలుగో వికెట్‌కు వీరు 86 పరుగులు జత చేశారు. కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నా 14వ ఓవర్‌లో 17 రన్స్‌తో ఛేదన వైపు తీసుకెళ్లారు. స్పిన్నర్‌ షాబాజ్‌ ఓవర్‌లో రూథర్‌ఫోర్డ్‌ 4,6 షారుక్‌ 6తో 19 రన్స్‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌లోనే షారుక్‌ 4,6,4 బాదడంతో సమీకరణం 4 ఓవర్లలో 54కు చేరింది. దీంతో మ్యాచ్‌ ఇరువైపులా మొగ్గుచూపింది. కానీ ఓరౌర్కీ 17వ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చి రూథర్‌ఫోర్డ్‌, తెవాటియా (2)ల వికెట్లు తీసి ఎల్‌ఎ్‌సజీ శిబిరంలో జోష్‌ నింపాడు. 19వ ఓవర్‌లో షారుక్‌ కూడా వెనుదిరగ్గా, అప్పటికే సమీకరణం క్లిష్టంగా మారింది. ఆరు బంతుల్లో 38 పరుగులు చేయాల్సి రావడంతో టైటాన్స్‌ ఓటమి ఖాయమైంది.


టాపార్డర్‌ హవా: పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ దూసుకెళ్లింది. ఎప్పటిలాగే ఓపెనర్లు మార్ష్‌, మార్‌క్రమ్‌తో పాటు నికోలస్‌ పూరన్‌ అదరగొట్టాడు. ఆరంభంలో బంతి అనూహ్యంగా బౌన్స్‌ కాగా.. మార్ష్‌కు సైతం పలుమార్లు శరీరానికి బంతి తాకడంతో విలవిల్లాడాడు. పవర్‌ప్లేలో పెద్దగా మెరుపులు లేకపోవడంతో ఎల్‌ఎస్‌జీ 58 రన్స్‌తో ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత మార్ష్‌ జోరు పెంచాడు. ప్రసిద్ధ్‌ ఓవర్‌లో 4,6 బాదిన తను స్పిన్నర్‌ సాయి కిశోర్‌ ఓవర్‌లో సిక్సర్‌ సాధించాడు. అయితే చక్కగా కుదురుకున్న ఈ జోడీని పదో ఓవర్‌లో సాయి విడదీశాడు. మార్‌క్రమ్‌ను అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మార్ష్‌-పూరన్‌ జోడీ టైటాన్స్‌ బౌలర్లపై విరుచుకుపడింది. పూరన్‌ తన తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఇక స్పిన్నర్‌ రషీద్‌ తొలి ఓవర్‌లో మార్ష్‌ చెలరేగి 6,4,6,4,4తో 25 పరుగులు రాబట్టాడు. అటు కిశోర్‌ ఓవర్‌లో 4,6.. సిరాజ్‌ ఓవర్‌లో 4,6,4తో పూరన్‌ ఎదురుదాడికి దిగడంతో లఖ్‌నవూ స్కోరు రాకెట్‌ వేగంతో సాగింది. మరోవైపు మార్ష్‌ 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకోగా.. 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది స్కోరును 200 దాటించాడు. ధాటిగా ఆడుతున్న ఈ ఓపెనర్‌ను అర్షద్‌ ఖాన్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 52 బంతుల్లోనే 121 పరుగుల మెరుపు భాగస్వామ్యానికి తెర పడింది. చివరి ఓవర్‌లో పంత్‌ (16 నాటౌట్‌) రెండు సిక్సర్లు బాది 20 రన్స్‌ అందించడంతో లఖ్‌నవూ స్కోరు 230 దాటింది.


స్కోరుబోర్డు

లఖ్‌నవూ: మార్‌క్రమ్‌ (సి) షారుక్‌ (బి) సాయి కిశోర్‌ 36; మార్ష్‌ (సి) రూథర్‌ఫోర్డ్‌ (బి) అర్షద్‌ ఖాన్‌ 117; పూరన్‌ (నాటౌట్‌) 56; పంత్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 235/2. వికెట్ల పతనం: 1-91, 2-212; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-37-0; అర్షద్‌ 3-0-36-1; రబాడ 4-0-45-0; ప్రసిద్ధ్‌ 4-0-44-0; సాయికిశోర్‌ 3-0-34-1; రషీద్‌ 2-0-36-0.

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) ఓ రౌర్కీ 21, గిల్‌ (సి) సమద్‌ (బి) అవేశ్‌ 35, బట్లర్‌ (బి) ఆకాశ్‌ సింగ్‌ 33, రూథర్‌ఫోర్డ్‌ (సి-సబ్‌) బిష్ణోయ్‌ (బి)ఓ రౌర్కీ 38, షారుక్‌ (సి-సబ్‌) బిష్ణోయ్‌ (బి) అవేశ్‌ 57, తెవాటియా (సి) హిమ్మత్‌ సింగ్‌ (బి) ఓ రౌర్కీ 2, అర్షద్‌ (సి) ఓ రౌర్కీ (బి) షాబాజ్‌ 1, రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 4, రబాడ (బి) బదోని 2, సాయి కిషోర్‌ (బి) బదోని 1, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం: 20 ఓవర్లలో 202/9; వికెట్లపతనం: 1-46, 2-85, 3-96, 4-182, 5-186, 6-193, 7-197, 8-200, 9-202; బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌ 3.1-0-29-1, ఆకాశ్‌ దీప్‌ 4-0-49-0, ఓ రౌర్కీ 4-0-27-3, అవేశ్‌ ఖాన్‌ 3.5-0-51-2; షాబాజ్‌ 4-0-41-1, బదోని 1-0-4-2.

1

ఒకే సీజన్‌లో ఎక్కువ మంది (9) 500+ స్కోర్లు సాధించడం ఐపీఎల్‌లో ఇదే

తొలిసారి.

1

ఓ సీజన్‌లో 25 అంతకంటే తక్కువ బంతుల్లోనే ఎక్కువ (5) ఫిఫ్టీలు సాధించిన బ్యాటర్‌గా పూరన్‌.

మిచెల్‌ మార్ష్‌ (64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 117)


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 13 9 4 0 18 0.602

బెంగళూరు 12 8 3 1 17 0.482

పంజాబ్‌ 12 8 3 1 17 0.389

ముంబై 13 8 5 0 16 1.292

ఢిల్లీ 13 6 6 1 13 0.019

లఖ్‌నవూ 13 6 7 0 12 -0.337

కోల్‌కతా 13 5 6 2 12 0.193

హైదరాబాద్‌ 12 4 7 1 9 -1.005

రాజస్థాన్‌ 14 4 10 0 8 -0.549

చెన్నై 13 3 10 0 6 -1.030

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 05:18 AM