ప్రపంచ కప్ విజేత యువ భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:45 PM
అండర్-19 ప్రపంచ కప్ 2026లో విశ్వ విజేతగా నిలిచిన యువ భారత్‌కు బీసీసీఐ రూ.7.50 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 ప్రపంచకప్-2026 విశ్వవిజేతగా యువ భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ టైటిల్ ను సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ (BCCI) భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ కప్ గెలిచిన యువ భారత క్రికెట్ బృందానికి రూ.7.50కోట్ల బహుమతి ఇస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. నిన్న (శుక్రవారం) హరారే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ (Team India) 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (vaibhav suryavanshi) 175 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ విజయం సాధించడంపై యావత్ దేశం, బీసీసీఐ గర్వంగా ఉందని తెలిపారు. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ప్రదర్శన అద్భుతమని ఆయన కొనియాడారు. ఈ నేపథ్యంలో భారత జట్టుకు రూ.7.50 కోట్లు బహుమతిగా బీసీసీఐ ప్రకటించిందని దేవ్‌జిత్ సైకియా వెల్లడించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సైతం విజేతలకు అభినందనలు తెలిపారు. ‘భారత క్రికెట్ వెలుగుతోంది. మన అండర్-19 జట్టు వరల్డ్ కప్ గెలవడం గర్వంగా ఉంది. మన జట్టు అద్భుతంగా ఆడింది. చక్కటి నైపుణ్యాలను ప్రదర్శించింది. ఈ విజయం, వారి పొరాట పటిమ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపింది. మన క్రికెటర్లకు నా అభినందనలు’ అని ప్రధాని యువ భారత జట్టును ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!