Share News

వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలి.! ట్వీట్ వైరల్

ABN , Publish Date - Feb 07 , 2026 | 10:46 AM

జింబాంబ్వేలోని హరారే వేదికగా శుక్రవారం జరిగిన అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐస్‌లాండ్‌ క్రికెట్ ట్వీట్ చేసింది.

వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలి.! ట్వీట్ వైరల్
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: జింబాంబ్వేలోని హరారే వేదికగా నిన్న(శుక్రవారం) జరిగిన అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్లో యువ భారత్ విశ్వ విజేతగా నిలిచింది. టైటిల్ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆరోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది భారత యువ జట్టు. ఈ మ్యాచ్‌లో యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర బ్యాటింగ్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడీ చిన్నోడు. అతడు 50 ఓవర్ల దాకా క్రీజులో నిలిచి ఉంటే కథ మరోలా ఉండేదేమో. ఇదిలా ఉండగా.. వైభవ్ ఇంగ్లాండ్ బౌలర్లను తుత్తునియలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా అనేక స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్‌ను అరెస్ట్ చేయాలంటూ వచ్చిన ఓ ఫన్నీ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఐస్‌లాండ్‌ క్రికెట్‌.. వైభవ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్‌ విరుచుకుపడిన తీరును ఎక్స్‌ రేటెడ్‌ హింసగా ఉందని, ఎవరైనా వైభవ్‌ను అరెస్ట్ చేయాలని ఐస్‌లాండ్‌ క్రికెట్ పేర్కొంది. ఇంగ్లండ్ బౌలర్లపై భారత బ్యాటర్ విరుచుకుపడిన తీరు నిజంగా ఎక్స్‌ రేటెడ్‌ హింసలాగే ఉంది. ఆ బాదుడు ఇంగ్లీష్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురిచేసింది.


వైభవ్ విధ్వంసాన్ని తలచుకుని ఇంగ్లీష్ బౌలర్లు కనీసం కొన్ని నెలలపాటు సుఖంగా నిద్రపోలేరని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వైభవ్‌ విధ్వంసాన్ని మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ఈ యువ బ్యాటర్ ఫైర్‌ చూసి ఇంగ్లండ్‌ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో తెలీక.. బంతిని ఎక్కడ వేయాలనే తికమకతో తలలు పట్టుకున్నారు. సూర్యవంశీ.. తన సునామీ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులనూ బద్దలుకొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ వంటివి కూడా ఉన్నాయి. ఈ చిన్నోడి ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీలు వరించాయి.


ఇవీ కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్

Updated Date - Feb 07 , 2026 | 11:49 AM