Share News

టీ20 ప్రపంచ కప్2028: అర్హత సాధించిన బంగ్లాదేశ్

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:26 PM

టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి అనూహ్యంగా వైదొలిగిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఓ శుభవార్త. 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ఆ జట్టు నేరుగా అర్హత సాధించింది.

టీ20 ప్రపంచ కప్2028: అర్హత సాధించిన బంగ్లాదేశ్
Bangladesh

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్( World Cup 2026) నుంచి అనూహ్యంగా వైదొలిగిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఓ శుభవార్త. 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ఆ జట్టు నేరుగా అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీకి సంబంధించి గురువారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు నేరుగా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించినట్లు తెలిపింది. బంగ్లాదేశ్‌ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటుందని ఐసీసీ పరోక్షంగా స్పష్టం చేసింది.


టీ20 ప్రపంచ కప్ 2026 ఎడిసన్ ఫిబ్రవరి 7న భారత్‌-శ్రీలంక వేదికగా ప్రారంభమై సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. వీటిని ఏ, బి, సి, డి అని నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్‌-2 జట్లు సూపర్‌-8కు అర్హత సాధించాయి. గ్రూప్‌-ఎ నుంచి భారత్(Team India), పాకిస్థాన్‌, గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే జట్లు సూపర్-8కి క్వాలిఫై అయ్యాయి. అలానే గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సూపర్‌-8కి అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే అనూహ్య రీతిలో సూపర్-8లో అడుగుపెట్టింది.


ఈ టోర్నీలో సూపర్-8కి అర్హత సాధించిన జట్లు 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్‌కి నేరుగా అర్హత సాధించాయి. అలానే ఆతిథ్య దేశాలుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా(Australia) కూడా టోర్నీకి అర్హత సాధించాయి. వీటితో పాటు బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, ఐర్లాండ్ జట్లు కూడా ఐసిసి ర్యాంకింగ్స్ ఆధారంగా టీ20 ప్రపంచకప్ 2028 టోర్నీకి నేరుగా క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ బంగ్లాదేశ్ 9వ స్థానంలో ఉంది. ఆఫ్గానిస్థాన్ 10వ స్థానంలో, ఐర్లాండ్ 12వ స్థానంలో ఉన్నాయి. 2028 టోర్నమెంట్ కోసం మిగిలిన ఎనిమిది స్థానాలను క్వాలిఫైయింగ్ మ్యాచుల ద్వారా నిర్ణయిస్తారు.


ఇవి కూడా చదవండి:

షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..

నువ్వు అద్భుతం.. పాకిస్థాన్ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు

Updated Date - Feb 19 , 2026 | 01:29 PM