నాలుగేళ్లలో ఏ ఆటగాడూ ఇంతగా మెరుగుపడలేదు: అంబటి రాయుడు
ABN , Publish Date - May 27 , 2026 | 08:00 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. గత నాలుగేళ్లలో ఊహించని రీతిలో పాటిదార్ మెరుగయ్యాడని కొనియాడాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి తమ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెంగళూరు ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించాడు. పాటిదార్ కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాటిదార్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు.
ఓ స్పోర్ట్స్ ఛానల్ షోలో అంబటి రాయుడు మాట్లాడుతూ... 'రజత్ పాటిదార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్‌ను అర్థం చేసుకోవడానికి ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నాడు. తర్వాత తనదైన షాట్లతో చెలరేగాడు. ఇదే ఆటగాడు 2022 ప్లేఆఫ్స్‌లో కూడా సెంచరీ కొట్టాడు. అప్పట్లో అతను బ్యాట్ ఫేస్ క్లోజ్ చేసి.. ఎక్కువగా ఆన్‌సైడ్ ఆడేవాడు. కానీ ఇప్పుడు టెక్నికల్ పరంగా చూస్తే అతను తన బ్యాట్ ఫేస్‌ను ఓపెన్ చేసి ఆడుతున్నాడు. అతని బ్యాట్ స్పీడ్ కూడా మెరుగైంది. గత నాలుగేళ్లలో ఏ ఆటగాడు కూడా ఈ స్థాయిలో ఇంప్రూవ్ అవ్వడం నేను చూడలేదు' అని రాయుడు తెలిపాడు.
'తన బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు రజత్ పాటిదార్ తీవ్రంగా శ్రమించి ఉంటాడు. అలాగే ఇలాంటి ఇన్నింగ్స్ కోసం చాలా కసిగా ఎదురు చూసినట్లున్నాడు. తన అనుభవాన్ని ఉపయోగించి జట్టుకు అవసరమైన పరిస్థితుల్లో జట్టు కోసం అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. భవిష్యత్‌లో పాటిదార్ భవిష్యత్తులో కేవలం ఆర్సీబీ కోసమే కాకుండా టీమిండియా తరఫున కూడా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడుతాడని ఆశిస్తున్నా. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేసిన విధానం చూశాక, అతను ఇప్పుడు ఒక సరికొత్త లీగ్ బ్యాటర్ల జాబితాలోకి చేరిపోయాడనిపిస్తోంద' అని అంబటి రాయుడు పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!
సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!