విజయవాడలో ‘సూపర్ ప్రెషర్ బెలూన్’ ప్రయోగం
ABN , Publish Date - May 27 , 2026 | 07:19 PM
విజయవాడ వేదికగా ‘రెడ్ బెలూన్ ఏరోస్పేస్’ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన ‘సూపర్ ప్రెషర్ బెలూన్’ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు.
విజయవాడ, మే 27: భారతదేశ అంతరిక్ష సాంకేతిక రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. విజయవాడ వేదికగా ‘రెడ్ బెలూన్ ఏరోస్పేస్’ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన ‘సూపర్ ప్రెషర్ బెలూన్’ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది దేశ రక్షణ, ప్రగతి రంగాల్లో ఒక చరిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.
రెడ్ బెలూన్ ఏరోస్పేస్ ఫౌండర్లు కిరణ్, శిరీష్‌ల పట్టుదల, కృషిని మంత్రి అభినందించారు. ఈ సరికొత్త టెక్నాలజీ కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పంటల స్థితిగతులను అంచనా వేయడం, భూమి సామర్థ్యాన్ని పరీక్షించడం, అత్యాధునిక ల్యాండ్ సర్వేలు నిర్వహించడం, మరియు అటవీ విస్తీర్ణాన్ని నిరంతరం పర్యవేక్షించడంలో ఈ సూపర్ ప్రెషర్ బెలూన్ కీలక పాత్ర పోషించనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ గత 12 ఏళ్లుగా అందిస్తున్న అపార ప్రోత్సాహం వల్లనే భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ ఇవాళ 8 బిలియన్ డాలర్ల భారీ పరిశ్రమగా ఎదిగిందని మంత్రి గుర్తుచేశారు. రాబోయే పదేళ్లలో ఈ రంగం ఏకంగా 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా దూసుకుపోతోందన్నారు. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య వంటి ప్రతిష్టాత్మక మిషన్ల విజయాలతో అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన నాయకత్వంలో అమరావతి సమీపంలో ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరిస్తోందని, దీని ద్వారా భవిష్యత్తులో సుమారు 150 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏపీని సరికొత్త ఆవిష్కరణల హబ్‌గా మార్చేందుకు ఇటువంటి ప్రయోగాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్