Share News

అభిషేక్ శర్మ సిక్సర్ల తుఫాన్.. 91 బంతుల్లో 233 పరుగులు

ABN , Publish Date - Aug 02 , 2026 | 05:02 PM

టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో అమృత్‌సర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్‌ తారన్‌ మెన్స్‌ సీనియర్‌ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు.

అభిషేక్ శర్మ  సిక్సర్ల తుఫాన్.. 91 బంతుల్లో 233  పరుగులు
Abhishek Sharma

స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో కొంతకాలంగా పరుగుల కోసం తంటాలుపడుతున్న టీమిండియా యంగ్ ఓపెనర్, డాషింగ్ హిట్టర్ అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకుని ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పంజాబ్ అంతర్ జిల్లాల సీనియర్ టోర్నీలో అమృత్‌సర్ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తరన్ తారన్ జట్టుపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.


కేవలం 91 బంతుల్లోనే 15 ఫోర్లు, ఏకంగా 25 సిక్సర్ల సాయంతో 256.04 స్ట్రైక్ రేట్‌తో 233 పరుగులు బాది డబుల్ సెంచరీ నమోదు చేశాడు. దీనికి సంబంధించిన స్కోర్‌కార్డ్, అభిషేక్ సిక్సర్ల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో అభిషేక్ శర్మ టీమిండియా తరఫున వరుసగా విఫలమయ్యాడు. జింబాబ్వే పర్యటనలో ఈ డాషింగ్ బ్యాటర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 3 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేసి, సగటున 3.66తో దారుణ ప్రదర్శన కనబరిచాడు.


ముజరబానీ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కు వెలుపల వచ్చే బంతులను అంచనా వేయలేక వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ వికెట్ సమర్పించుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గత 10 అంతర్జాతీయ T20 ఇన్నింగ్స్‌లలో కేవలం ఒకే ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించిన అభిషేక్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్1 స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయాడు.


అంతర్జాతీయ స్థాయిలో ఆఫ్ స్టంప్ అవతలి బంతులతో ఇబ్బంది పడుతూ, క్రీజులో అసౌకర్యంగా కనిపించిన అభిషేక్ శర్మ.. ఈ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మళ్లీ తనపై తనకు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. ఈ డబుల్ సెంచరీ ఫామ్ రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆయనకు ఎంతో ఊరటనిచ్చే అంశమని క్రికెట్ నిపుణులు అన్నారు.


ఇవి కూడా చదవండి:

భారత జట్టుకు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

యువరాజ్ సింగ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Updated Date - Aug 02 , 2026 | 06:03 PM