Share News

వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత ఇన్నింగ్స్..

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:03 PM

భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత ఇన్నింగ్స్..
Aashirvaad Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. బౌలర్ ఎవరు అనే విషయం పట్టించుకోకుండా బౌండరీలు బాదడమే వైభవ్ నైజం. అతడి బ్యాటింగ్ విధ్వంసం ధాటికి అనేక రికార్డులు కూడా బద్దలు అయ్యాయి. అంతేకాక 15 ఏళ్ల వయసులోనే సీనియర్ భారత జట్టుకు ఎంపికై.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డునే బ్రేక్ చేశాడు ఈ చిచ్చర పిడుగు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు.


వైభవ్ చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే సెంచరీ బాది యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. తనకంటే సీనియర్ బౌలర్లను సైతం విడిచిపెట్టలేదు. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ.. అన్న బాటలోనే ఆశీర్వాద్ అడుగులు వేస్తున్నాడు. తాజాగా బిహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ అద్భుతమైన సెంచరీతో చెల‌రేగాడు.


'క్రికెట్ అకాడమీ తాజ్‌పూర్' జట్టు తరఫున ఆడిన ఈ జూనియర్‌ వైభవ్ 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. తమ్ముడి క్లాస్ ఇన్నింగ్స్ చూసి సంతోషం వ్యక్తం చేసిన వైభవ్ సూర్యవంశీ... సోషల్ మీడియా ద్వారా ఆశీర్వాద్‌కు అభినందనలు తెలిపాడు. ఆశీర్వాద్ స్కోర్ కార్డ్‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియాకు మరో హిట్టర్ దొరికాడంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్ 2026: అమెరికా సంచలన విజయం

నేడు భారత్- అఫ్గాన్ మ్యాచ్‌.. అంత‌లోనే స్టార్‌ క్రికెట‌ర్ తండ్రి మృతి

Updated Date - Jun 13 , 2026 | 12:25 PM