నేడు భారత్- అఫ్గాన్ మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మృతి
ABN , Publish Date - Jun 13 , 2026 | 09:21 AM
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా ఇవాళ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా తొలి వన్డే శనివారం జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అఫ్గాన్ బృందంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ దర్విష్ రసూలీ తండ్రి కన్నుమూశారు.
తండ్రి మరణ వార్త తెలుసుకుని రసూలీ తన కుటుంబానికి అండగా ఉండేందుకు వెంటనే స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని నిన్న(శుక్రవారం) జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించాడు. 'దర్విష్ రసూలీ తండ్రి మరణించిన అతడి కుటుంబ సభ్యుల ద్వారా మాకు తెలిసింది. ఇది చాలా బాధాకరం. ఇలాంటి క్లిష్ట సమయంలో అతడు తన కుటుంబానికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు' అని షాహిదీ పేర్కొన్నాడు. అతడు తిరిగి జూన్ 17న లఖ్‌నవూలో జరిగే రెండో వన్డే సమయానికి జట్టుతో చేరే అవకాశముంది.
దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న రసూలీ ఇప్పటివరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. భారత్, అఫ్గాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులోరసూలీ పాల్గొనలేదు. అయితే ధర్మశాల వేదికగా అతడు భారత్‌పై వన్డే అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. అంతలోనే అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే అఫ్గానిస్థాన్ తరఫున 28 టీ20లు ఆడిన రసూలీకి లిస్ట్-ఎ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అతడు 54.94 సగటుతో, 93.79 స్ట్రైక్ రేట్‌తో 3,022 పరుగులు చేశాడు. ఇప్పుడు రసూలీ లేకపోవడంతో తుది జట్టు ఎంపికకు అఫ్గాన్ వద్ద 14 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. యాదృచ్చికంగా టీమిండియా వద్ద కూడా అంతే మంది ఉన్నారు. గాయం కారణంగా హార్దిక్ పాండ్య సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్ధానాన్ని బీసీసీఐ ఇంకా భర్తీ చేయలేదు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ కప్‌లో మొట్టమొదటి పాయింట్ సాధించిన కెనడా
వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ