Share News

కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం.. ముత్తుపాండికి నజరానా ప్రకటించిన సీఎం విజయ్

ABN , Publish Date - Jul 27 , 2026 | 04:50 PM

కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రాజా ముత్తుపాండికి తమిళనాడు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.30 లక్షల నగదు బహుమతిని అందిస్తున్నట్లు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ వెల్లడించారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం.. ముత్తుపాండికి నజరానా ప్రకటించిన సీఎం విజయ్
Raja Muthupandi

ఇంటర్నెట్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రాజా ముత్తుపాండికి తమిళనాడు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.30 లక్షల నగదు బహుమతిని అందిస్తున్నట్లు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికపై అద్బుత ప్రదర్శనతో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచిన ముత్తుపాండిని విజయ్ అభినందించారు.


‘కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 65 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన రాజా ముత్తుపాండికి హృదయపూర్వక అభినందనలు. ఆయన విజయం తమిళనాడుకు ఎంతో గర్వకారణం. ఈ ఘనత రాష్ట్ర యువతకు స్ఫూర్తిగా నిలవాలి. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం విజయ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.


తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన రాజా ముత్తుపాండి పురుషుల 65 కిలోల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన అతడు, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలం కావడంతో స్నాచ్‌లో 126 కిలోలతో సరిపెట్టుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలోనూ తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి.. ఆ తర్వాత పుంజుకుని రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తాడు. దీంతో మొత్తం 286 కిలోల బరువును ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

గంభీర్‌ను తప్పించండి అంటూ వార్తలు.. కోచ్ పదవిపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ

ఎలా ఆడాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: సంజు శాంసన్

Updated Date - Jul 27 , 2026 | 04:52 PM