ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్: భారత షూటర్ల హవా.. ఈషా సింగ్‌కు స్వర్ణం
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:52 PM
చైనాలోని హాంగ్‌ఝౌలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ పోటీల్లో భారత షూటర్లు సత్తా చాటారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ పసిడి పతకం సాధించింది. ఒలింపిక్ పతక విజేత మను బాకర్ కాంస్య పతకం నెగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని హాంగ్‌ఝౌలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ పోటీల్లో భారత షూటర్లు సత్తా చాటారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ పసిడి పతకం సాధించింది. మరోవైపు ఒలింపిక్ పతక విజేత మను బాకర్ కాంస్య పతకం నెగ్గింది. దీంతో ఈ విభాగంలో భారత్‌కు డబుల్ పోడియం లభించింది. 21 ఏళ్ల హైదరాబాద్ షూటర్ ఈషా ఫైనల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చింది. 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. కఠినమైన షూట్-ఆఫ్‌ను దాటుకుని పోటీలో నిలిచిన మను బాకర్ చివరకు 28 హిట్స్‌తో కాంస్య పతకాన్ని అందుకుంది.
క్వాలిఫికేషన్‌లో మను బాకర్ 586-20x స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా, ఈషా సింగ్ 585-18xతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఫైనల్‌లో మాత్రం మను బాకర్‌ను వెనక్కి నెట్టి ఈషా సింగ్ స్వర్ణం సాధించింది.
ఒత్తిడిని జయించా: ఈషా
స్వర్ణ పతకం సాధించిన అనంతరం ఈషా తన గెలుపుపై మాట్లాడింది. గత ప్రపంచకప్‌లో రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన తర్వాత ఈసారి తనపై అంచనాలు పెరిగాయని, వాటిని అధిగమించడమే పెద్ద సవాల్‌గా మారిందని చెప్పింది. ‘మునిచ్‌లో పతకం సాధించిన తర్వాత ఈ పోటీలో ఒత్తిడి మరింత ఎక్కువగా అనిపించింది. విజయాలు పెరిగే కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుంది. ఆ ఒత్తిడిని అధిగమించి మరోసారి గెలవడం చాలా ఆనందంగా ఉంది. హాంగ్‌ఝౌ వేదిక నాకు ఎంతో ప్రత్యేకం. 2023 ఆసియా క్రీడల్లో ఇక్కడే నాలుగు పతకాలు గెలిచాను. ఈ రేంజ్, లైటింగ్, వాతావరణం నాకు బాగా తెలుసు. అదే ఫైనల్లో నాకు కలిసొచ్చింది’ అని పేర్కొంది.
కాంస్యం కూడా విలువైనదే: మను
స్వర్ణం చేజారినా కాంస్య పతకాన్ని మను బాకర్ సానుకూలంగానే స్వీకరించింది. ‘ఈ పతకం నాకు ఎంతో కీలకం. నా ఆటలో నేను ఏం మార్చుకోవాలి.. ఎందులో మెరుగుపడాలి వంటి విషయాల్లో నాకు స్పష్టత వచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా క్రీడల వంటి పెద్ద టోర్నీలకు ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. పతకం ఆత్మవిశ్వాసాన్ని పెంచినా, ఈ పోటీలో పొందిన అనుభవమే నాకు మరింత విలువైనది’ అని మను పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
గంభీర్‌ను తప్పించండి అంటూ వార్తలు.. కోచ్ పదవిపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ
ఎలా ఆడాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: సంజు శాంసన్