ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశా.. టీమిండియా స్టార్ స్పిన్నర్
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:30 AM
తాను ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశానని టీమిండియా స్టార్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: తాను ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశానని టీమిండియా స్టార్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్‌లో చాహల్ ఈ విషయం గురించి మాట్లాడాడు. కాగా చాహల్.. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే.
‘నేను ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశా. ఆరు నెలలుగా నేను మందు ముట్టడం లేదు. నా వయసు ఇప్పుడు 35. నేను మరింత యాక్టివ్‌గా ఉండి టీమ్ కోసం 150 శాతం ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నా. గత సీజన్‌లో కేకేఆర్‌తో ఓ మ్యాచ్ తర్వాత నా పక్కటెముక, కాలి వేలు విరిగింది. అందుకే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచుల్లో సరైన ప్రదర్శన చేయలేకపోయా. కానీ ఈసారి అలా కాదు. ఓ సీనియర్ ఆటగాడిగా ఈ ఐపీఎల్‌లో ప్రజలు నా నుంచి ఏదైనా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను’ అని చాహల్ అన్నాడు.
అతడు ఉండాల్సింది..
‘గత సీజన్‌లో మేం ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడ్డాం. ఆ మ్యాచ్‌లో మా స్టార్ ప్లేయర్ మార్కో యాన్సెన్ జట్టుకు దూరమయ్యాడు. ఒకవేళ అతడు ఆడి ఉంటే.. మేం కచ్చితంగా ఐపీఎల్ టైటిల్ గెలిచి ఉండేవాళ్లం. అతడు గత సీజన్‌లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. చివర్లో రెండు నుంచి మూడు సిక్సర్లు కొట్టగల సామర్థ్యం అతడికి ఉంది. ప్రస్తుతం యాన్సెన్ బౌలింగ్ చేస్తున్న విధానం చూసి మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం’ అని చాహల్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
‘ఐపీఎల్’పై పిటిషన్ దాఖలు.. కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు
విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్