Share News

‘ఐపీఎల్’పై పిటిషన్ దాఖలు.. కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు

ABN , Publish Date - Mar 19 , 2026 | 10:04 AM

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ పేరుపై వచ్చిన వివాదానికి కేరళ హైకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది.

‘ఐపీఎల్’పై పిటిషన్ దాఖలు.. కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు
IPL petition

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ పేరుపై వచ్చిన వివాదానికి కేరళ హైకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఐపీఎల్ పేరును బీసీసీఐ అక్రమంగా ఉపయోగిస్తోందంటూ ఓ పిటిషనర్ గతంలో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ చేపట్టిన కోర్టు.. ఆ పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.


అశీఖ్ కరోత్ అనే ఓ సామాజిక కార్యకర్త ఐపీఎల్ పేరుపై పిటిషన్ దాఖలు చేశాడు. ‘ఇదేమీ జాతీయ టోర్నీ కాదు. అలాంటప్పుడు ‘ఇండియన్’ అనే పేరు ఎలా వాడుతారు? బీసీసీఐ అక్రమంగా ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ అనే పేరును వాడుతోంది. ఇది సమంజసం కాదు’ అంటూ కోర్టుకెక్కాడు. అయితే కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సౌమెన్ సేన్, జస్టిస్ శ్యామ్ కుమార్ ధర్మాసనానికి ఈ అంశంపై వాదనలు వినిపించారు. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే మెగా టోర్నీ ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. ఐపీఎల్ గురించి ఇప్పటికిప్పుడు తెలుసుకుని పిటిషన్ వేయడం పద్ధతి కాదు. మీ వాదనలో బలం లేదు. సరైన ఆధారాలు లేవు’ అంటూ ఆ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది.


చిన్నస్వామిలో మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్

ఐపీఎల్ 2026 ఆరంభానికి ఆర్సీబీ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ.. హోం గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట విక్టరీ పరేడ్ నిర్వహించింది. దీంట్లో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగడానికి వీల్లేదంటూ కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కర్ణాటక ప్రభుత్వం.. చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్సీబీ హోం గ్రౌండ్‌ను వేరే దగ్గరకి తరలించాల్సిన అవసరం లేకపోయింది. ఐపీఎల్ 2026కి ముందు నెలకొన్న వివాదాలన్నింటికీ ఫుల్ స్టాప్ పడటంతో.. అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజు శాంసన్.. టీమిండియా దిగ్గజం ఏమన్నాడంటే!

విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్

Updated Date - Mar 19 , 2026 | 11:10 AM