ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్ల గురించి మాకు సంబంధం లేదు: బీసీసీఐ
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:11 PM
ఐపీఎల్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. ఐపీఎల్ 2026లో విదేశీ ప్లేయర్ల విషయంలో ఫ్రాంచైజీల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీసీసీఐ స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. ఐపీఎల్ 2026లో విదేశీ ప్లేయర్ల విషయంలో ఫ్రాంచైజీల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గాయాల కారణంగా, జాతీయ జట్టుకు ఆడుతుండటం వల్ల కొందరు స్టార్ ప్లేయర్లు ఈ సీజన్‌లో ఆలస్యంగా హాజరయ్యారు. మరొకొందరు టోర్నీ మొత్తానికే దూరమయ్యారు. ఈ అంశంపై బీసీసీఐ స్పందించింది. విదేశీ ప్లేయర్లు, ఫ్రాంచైజీల విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోదని తేల్చి చెప్పింది. అలాగే వచ్చే వేలం కోసం పర్స్ విలువను పెంచాలనే విజ్ఞప్తిని కూడా బీసీసీఐ తిరస్కరించింది.
ఫ్రాంచైజీలదే బాధ్యత..
విదేశీ ప్లేయర్ల అందుబాటు విషయంలో ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సమయంలో ప్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ అంశంలో జట్లకు, ఆటగాళ్లకు మధ్యవర్తిత్వం చేసే ఉద్దేశం తమకు లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ‘ఆటగాళ్ల విషయంలో ఫ్రాంచైజీలే బాధ్యత వహించాలి. అందుబాటులో ఉండటంపై వారికే వదిలేస్తున్నాం. కొందరు తమ జాతీయ జట్టు కోసం ఐపీఎల్‌లో ఆడకూడదని అనుకుంటారు.. మరికొందరు ఐపీఎల్‌కే ప్రాధాన్యం ఇస్తారు. అది వాళ్ల ఇష్టం. కానీ మా రూల్స్ మాత్రం స్పష్టంగా ఉన్నాయి. గాయం మినహా.. మరే ఇతర కారణంతో అయినా టోర్నీని వీడితే రెండేళ్లపాటు బ్యాన్ విధిస్తాం’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
పర్స్ పెంపుపై..
ప్రస్తుతం ఐపీఎల్ వేలంలోకి ప్రతి ఫ్రాంచైజీ రూ.125 కోట్లుతో వెళ్తుంది. అయితే దీనిని మరింత పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రముఖ లీగ్‌లతో ఐపీఎల్‌ను పోల్చడం ఆపేయాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఒకేసారి పెద్ద మొత్తం కాకుండా.. నెమ్మదిగా పర్స్ విలువను పెంచుతూ వెళ్తామని తెలిపింది.
2028 నుంచి 94 మ్యాచ్‌లు?
ప్రస్తుతం 74 మ్యాచ్‌లతో జరుగుతున్న ఐపీఎల్‌ను 2028 నుంచి 94 మ్యాచ్‌లకు విస్తరించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం టోర్నీని మార్చి తొలి వారంలో ప్రారంభించి మే మధ్య వరకు నిర్వహించడం ఉత్తమ మార్గమని భావిస్తోంది. ‘ప్రస్తుత షెడ్యూల్‌లో 94 మ్యాచ్‌లు నిర్వహించడం కష్టమే. మే తర్వాత వర్షాకాలం ప్రారంభమవుతుంది. అందుకే మార్చి తొలి వారం నుంచి మే 15 వరకు టోర్నీ నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుంది’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. క్రికెట్‌లో ఫ్రాంచైజీ లీగ్‌ల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్‌ల అవసరంపై కూడా బీసీసీఐ చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు.. బంగ్లా క్రికెటర్ ఆరోపణలు
ఆస్ట్రేలియా ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి