Share News

పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు.. బంగ్లా క్రికెటర్ ఆరోపణలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 03:43 PM

బంగ్లాదేశ్ క్రికెటర్ నయీం హసన్ చిట్టోగ్రామ్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశాడు. పోలీసులు వేధించడమే కాకుండా తనపై దాడి చేశారని హసన్ ఆరోపించాడు.

పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు.. బంగ్లా క్రికెటర్ ఆరోపణలు
Naeem Hasan

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ క్రికెటర్ నయీం హసన్ చిట్టోగ్రామ్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశాడు. పోలీసులు వేధించడమే కాకుండా తనపై దాడి చేశారని హసన్ ఆరోపించాడు. ఈ ఘటన ప్రస్తుతం బంగ్లా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై బంగ్లా క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. జాతీయ క్రికెటర్ పట్ల జరిగిన ఈ వ్యవహారం అత్యంత విచారకరమని పేర్కొంది.


ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ తరఫున నయీం హసన్ ప్రాతినిధ్యం వహించాడు. శుక్రవారం ఫైనల్ మ్యాచ్ అనంతరం నయీం స్వగ్రామం చిట్టోగ్రామ్‌కి బయలుదేరాడు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘మ్యాచ్ అనంతరం ఇంటికి వెళ్లాలనుకున్నా. విమానం ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వరకు రాత్రి అయింది. 11.25 గంటల సమయంలో ఎయిర్‌పోర్ట్ నుంచి మా స్వగ్రామానికి ఆటోలో బయలుదేరాను. లాల్‌ఖాన్ బజార్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు నేను ప్రయాణిస్తున్న ఆటోను ఆపి తనిఖీలు చేశారు. నా బ్యాగ్‌లు కూడా చెక్ చేశారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు.. నాపై దాడి చేయడం మొదలు పెట్టారు. నా గొంతు పట్టుకుని పోలీసు వాహనంలోకి ఎక్కించారు. నన్ను తీవ్రంగా కొట్టారు. బంగ్లాదేశ్ జాతీయ జట్టు క్రికెటర్‌నని చెప్పినా పట్టించుకోలేదు’ అని నయీం ఆరోపించాడు.


బీసీబీ ఆగ్రహం

ఈ ఘటనపై బంగ్లా క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ క్రికెటర్ పట్ల జరిగిన ఈ వ్యవహారం అత్యంత విచారకరమని పేర్కొంది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కాగా, జింబాబ్వేతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన నయీం హసన్‌కు ఈ ఘటన ఎదురుకావడం బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి:

భారత్, అఫ్గాన్ తొలి వన్డేకు పొంచి ఉన్న వాన ముప్పు!

వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత ఇన్నింగ్స్..

Updated Date - Jun 13 , 2026 | 04:07 PM