Share News

గంభీర్‌పై వేటు?.. టీమిండియా వైఫల్యాలపై బీసీసీఐ కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 10 , 2026 | 08:52 PM

ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో జట్టు ప్రదర్శనపై బీసీసీఐ దృష్టి సారించింది. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై తక్షణ చర్యలు తీసుకునే ఆలోచన లేదని బోర్డు స్పష్టం చేసింది.

గంభీర్‌పై వేటు?.. టీమిండియా వైఫల్యాలపై బీసీసీఐ కీలక ప్రకటన
BCCI

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన కొద్ది నెలలకే టీమిండియా వరుస పరాజయాలు చవిచూడటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టుపై చేసే ప్రయోగాల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో జట్టు ప్రదర్శనపై బీసీసీఐ దృష్టి సారించింది. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై తక్షణ చర్యలు తీసుకునే ఆలోచన లేదని బోర్డు స్పష్టం చేసింది.


పసికూన ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కోల్పోయింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఆరు టీ20 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. ఈ పరిణామాలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ‘ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శనను బీసీసీఐ గమనిస్తోంది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోం. ప్రస్తుతం భారత టీ20 జట్టు ఓ చెడు దశను ఎదుర్కొంటోంది’ అని తెలిపారు. జులై 19న ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కూడా ముగిసిన తర్వాత భారత జట్టు ప్రదర్శనపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సైకియా వెల్లడించారు. ‘జట్టు ఎక్కడ తప్పు చేసింది? లోపాలను ఎలా సరిదిద్దాలి? అనే అంశాలపైనే సమీక్ష ఉంటుంది. మరే ఇతర విషయాలు చర్చకు రావు’ అని ఆయన స్పష్టం చేశారు.


గంభీర్‌ పదవికి ముప్పు లేనట్టే!

గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐతో 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఒప్పందం ఉంది. దీంతో ప్రస్తుతం అతడి పదవికి ఎలాంటి ముప్పు లేదని సమాచారం. రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన కోచ్‌పై కేవలం కొన్ని సిరీస్ పరాజయాల కారణంగా వేటు వేయడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం బీసీసీఐలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గంభీర్ నేతృత్వంలో కొన్ని అనుకోని పరాజయాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్ వైట్‌వాష్, సొంతగడ్డపై వన్డే సిరీస్ ఓటమి, ఐర్లాండ్ చేతిలో తొలి టీ20 సిరీస్ పరాజయం వంటి ప్రతికూల రికార్డులు నమోదయ్యాయి.


సమీక్షలో గంభీర్‌కు కీలక ప్రశ్నలు?

జట్టు ఎంపిక, తుది జట్టు కూర్పుపై గంభీర్‌ కొన్ని ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసినా, తుది జట్టును నిర్ణయించడంలో కోచ్ పాత్ర కీలకం. ముఖ్యంగా సంజు శాంసన్‌ను పక్కన పెట్టి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు మ్యాచ్‌ల తర్వాత శాంసన్‌ను ‘విశ్రాంతి’ పేరుతో తప్పించడంపై కూడా చర్చ సాగుతోంది.


ఇవి కూడా చదవండి:

లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

Updated Date - Jul 10 , 2026 | 09:18 PM