వైభవ్ సూర్యవంశీ వివాదం.. స్పందించిన బీసీసీఐ
ABN , Publish Date - Jun 16 , 2026 | 09:32 PM
శ్రీలంక-ఎ ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో వైభవ్‌పై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. ఈ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం శ్రీలంక-ఎపై భారత్-ఎ జట్టు సూపర్ ఓవర్లో ఓడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిశాక వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ప్లేయర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లంక ప్లేయర్‌ను వైభవ్ తోసేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అతడిపై చర్యలు ఉంటాయంటూ చర్చ మొదలైంది. ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది. వైభవ్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే ఆలోచన లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
దంబుల్లాలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సూపర్ ఓవర్‌లో భారత్-ఎ ఓటమిపాలైంది. సూపర్ ఓవర్లో 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన భారత జట్టు.. కేవలం 9 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం శ్రీలంక ప్లేయర్.. వైభవ్ సూర్యవంశీని ఏదో అన్నాడు. దీంతో మైదానం వీడి వెళ్తున్న సూర్యవంశీ తిరిగి వారి వైపు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఓ శ్రీలంక ఆటగాడిని తోసివేయడంతో వివాదం మరింత ముదిరింది. చివరకు ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ యువ ఆటగాడిపై చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే సైకియా ఆ వార్తలను ఖండించారు. ‘ఇది యువ ప్లేయర్లకు కీలక టోర్నమెంట్. ఆటగాళ్లు కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలి. ఇలాంటి వివాదాలకు వెళ్లి ఏకాగ్రత కోల్పోవద్దు’ అని స్పష్టం చేశారు.
ఐసీసీ చర్యలు తీసుకుంటుందా?
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం మైదానంలో అనుచిత ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 ప్రకారం ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, అంపైర్లు లేదా ఇతర వ్యక్తులతో ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంగా లేదా అనవసరంగా తాకడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఈ ఘటన తీవ్రతను నిర్ణయించే సమయంలో ఉద్దేశపూర్వకంగానే చేయి చేసుకున్నారా? గాయాలయ్యాయా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ఈ ఘటనపై ఐసీసీ మ్యాచ్ రిఫరీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
సెరెనా విలియమ్స్ రీఎంట్రీ.. సోదరి వీనస్‌తో వింబుల్డన్‌లో బరిలోకి!
నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. పోలీసులకు గంగూలీ ఫిర్యాదు