నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. పోలీసులకు గంగూలీ ఫిర్యాదు
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:07 PM
భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో అతడి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో అతడి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ ఫేస్‌బుక్ పేజీ తనపై అసత్య ప్రచారాలు చేస్తూ.. పరువు నష్టం కలిగించే పోస్టులు పెడుతుందని పేర్కొంటూ కోల్‌కతా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
‘ప్రజా జీవితంలో విమర్శలు, భిన్నాభిప్రాయాలు సహజమే. కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ, నా ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం అంగీకారయోగ్యం కాదు. ఆ పేజీని నిర్వహిస్తోన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని గంగూలీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులో ఓ క్రీడా వార్తల వెబ్‌సైట్ పేరును కూడా ప్రస్తావించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో గంగూలీ ఒకడు. 1996లో ఇంగ్లండ్‌పై లార్డ్స్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన దాదా.. తొలి టెస్టులోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఆ తర్వాతి టెస్టులోనూ శతకం సాధించి తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన అరుదైన బ్యాటర్ల జాబితాలో చేరాడు. 2000లో భారత జట్టు పగ్గాలు చేపట్టిన గంగూలీ.. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టును కొత్త దిశగా నడిపించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో గంగూలీ 113 టెస్టులు, 311 వన్డేలు ఆడి మొత్తం 18,575 పరుగులు చేశాడు. టెస్టుల్లో 7,212 పరుగులు, వన్డేల్లో 11,363 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
ఎన్‌బీఏ టైటిల్ వేడుకలో కాల్పుల కలకలం..
మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్