ఎన్‌బీఏ టైటిల్ వేడుకలో కాల్పుల కలకలం..
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:16 PM
నేషనల్ బాస్కేట్‌బాల్ అసోసియేషన్(ఎన్‌బీఏ)లో 53 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ న్యూయార్క్ నిక్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది.
ఇంటర్నెట్ డెస్క్: నేషనల్ బాస్కేట్‌బాల్ అసోసియేషన్(ఎన్‌బీఏ)లో 53 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ న్యూయార్క్ నిక్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. సంబరాల్లో మునిగిపోయిన అభిమానులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియో ప్రకారం, టైమ్స్ స్క్వేర్‌లోని 42వ వీధి-బ్రాడ్‌వే కూడలి సమీపంలో వరుసగా ఏడుసార్లు తుపాకీతో పేల్చిన శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. భారీ జనసందోహం కారణంగా అంబులెన్స్ చేరుకోలేకపోవడంతో పోలీసులు తమ వాహనంలోనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులతో పాటు హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. నలుగురిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో వీడియోలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి లోడెడ్ గన్‌ను స్వాధీనం చేసుకున్న దృశ్యాలు కనిపించాయి.
విజయోత్సవ సంబరాలు క్రమంగా అల్లర్లుగా మారడంతో కొందరు అభిమానులు పోలీసు వాహనాలపై దాడులకు దిగారు. బేస్‌బాల్ బ్యాట్లతో పోలీసు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఐదు స్కూల్ బస్సులు, ఐదు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. వీధుల్లో ఘర్షణలు చోటుచేసుకోగా కొందరు ల్యాంప్ పోస్టులు, ట్రాఫిక్ సిగ్నల్స్ పైకి ఎక్కి బాణాసంచా పేల్చారు. ఈ అల్లర్లలో 10 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 63 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?
మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్