48 గంటల్లో వివరణ ఇవ్వాలి.. రోమి భిందర్‌కు బీసీసీఐ నోటీసులు
ABN , Publish Date - Apr 13 , 2026 | 02:57 PM
ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ కఠిన చర్యలకు ఉపక్రమించింది. 48 గంటల్లో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కారణంగానే రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడాల్సి వచ్చిందంటూ పలు నివేదకలు పేర్కొన్నాయి. ఆ సమయంలో రోమి పక్కనే ఆర్ఆర్ విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ‘ఈ విషయాన్ని యాంటీ కరప్షన్ అండ్ సెక్యురిటీ యూనిట్(ఏసీఎస్‌యూ)కి అప్పగించాం. పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం’ అని తెలిపారు. ఏసీఎస్‌యూ ఇప్పటికే భిందర్‌కు 48 గంటల గడువు ఇస్తూ నోటీస్ పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. రోమిపై కఠిన చర్యలు తీసుకోవాలని బహిరంగంగా డిమాండ్ చేయడం గమనార్హం.
కారణాలు ఏవైనా..
భిందర్ ఫోన్ వినియోగం వెనుక వైద్య కారణాలు ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. గతంలో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందిన ఆయన, ప్రస్తుతం ఆస్తమాతో బాధపడుతున్నట్లు సమాచారం. ‘ఆరోగ్య పరిస్థితుల కారణంగా రోమి భిందర్ ఎక్కువగా నడవలేరు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కాల్సి రావడంతో డగౌట్‌లోకి ఫోన్ తెచ్చుకున్నారు. కాల్, మెసేజేస్ లాంటివి ఏమీ చేయలేదు. కేవలం స్క్రోల్ చేశారు’ అని జట్టు వర్గాలు వెల్లడించాయి. అతడి ఆరోగ్య పరిస్థితులను బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందని అనుకున్నప్పటికీ.. తాజాగా నోటీసులు జారీ చేయడం కొసమెరుపు. ఈ వివాదంపై ఏసీఎస్‌యూ తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
ఎంఐతో మ్యాచ్‌లో కోహ్లీకి గాయం.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఏమన్నాడంటే?
రోమి బిందర్ ఫోన్ వినియోగించడానికి అదే కారణం!