Share News

ఎంఐతో మ్యాచ్‌లో కోహ్లీకి గాయం.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఏమన్నాడంటే?

ABN , Publish Date - Apr 13 , 2026 | 02:33 PM

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. అయితే ముంబైపై మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేయకపోవడంపై చర్చ మొదలైంది. గాయం కారణంగా కోహ్లీ డగౌట్‌లోనే ఉండిపోయాడు. ఈ విషయంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు.

ఎంఐతో మ్యాచ్‌లో కోహ్లీకి గాయం.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఏమన్నాడంటే?
rajat patidar

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేయకపోవడంపై చర్చ మొదలైంది.


గాయం కారణంగా కోహ్లీ డగౌట్‌లోనే ఉండిపోయాడు. అతడి స్థానం బెథెల్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం కూడా అతడు కుంటుతూ వీడియోలకు చిక్కాడు. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ గాయంపై కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ‘కోహ్లీ గాయంపై పూర్తి సమాచారం లేదు. ఉన్నట్టుండి మైదానాన్ని వీడాడు. అయితే ప్రస్తుతం మాత్రం అతడు బాగానే ఉన్నాడు. గాయం తీవ్రత పెద్దది కాదనే అనిపిస్తోంది’ అని రజత్ తెలిపాడు.


ప్రత్యేకంగా అనిపిస్తోంది..

వాంఖడేలో ముంబైపై విజయం సాధించడం గొప్పగా ఉందని రజత్ తెలిపాడు. తన గెలుపుపై మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ‘ముంబైలో.. ముఖ్యంగా ఈ గ్రౌండ్‌లో ఆడి గెలవడం ప్రత్యేకం అనుభూతినిస్తోంది. విరాట్ భాయ్, సాల్ట్ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. అక్కడి నుంచే ఆధిపత్యం ప్రదర్శించగలిగాం. ఆ తర్వాత నేను, టిమ్ డేవిడ్ దూకుడుగా ఆడటం వల్ల జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. నాకు స్పిన్ అంటే ఇష్టం అంటారు. కానీ నిజానికి నాకు పేస్ బౌలింగ్ ఎదుర్కోవడమే ఎక్కువగా నచ్చుతుంది. ఈ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది’ అని రజత్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

అంపైర్లతో బంతాట ఆడుకున్న టిమ్ డేవిడ్! వీడియో వైరల్...

చరిత్ర సృష్టించిన రోహిత్

Updated Date - Apr 13 , 2026 | 02:33 PM