Share News

అంపైర్లతో బంతాట ఆడుకున్న టిమ్ డేవిడ్! వీడియో వైరల్...

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:46 AM

నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సమయంలో స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బంతి ఆకారంపై అనుమానం వ్యక్తం చేశాడు.

అంపైర్లతో బంతాట ఆడుకున్న టిమ్ డేవిడ్! వీడియో వైరల్...
Tim David ball confusion

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. 18 పరుగుల తేడాతో ముంబైపై బెంగళూరు విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సమయంలో స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బంతి ఆకారంపై సందేహం వ్యక్తం చేశాడు. అంతేకాక కాసేపు బంతిని పరిశీలిస్తున్నట్లు అంపైర్లతో ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ సమయంలో బంతి సరిగ్గా లేదని అంపైర్లకు చూపిస్తూ టిమ్ డేవిడ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. బంతి సరిగ్గానే ఉందంటూ టిమ్ డేవిడ్ నుంచి దాన్ని తీసుకోవడానికి అంపైర్లు ప్రయత్నించారు. అయితే వారికి బంతిని ఇవ్వకుండా ఎక్కువ సేపు పరిశీలిస్తూ టిమ్ డేవిడ్ తన అభ్యంతరాన్ని గట్టిగా వినిపించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కూడా జోక్యం చేసుకున్నాడు. అంపైర్లతో మాట్లాడి డేవిడ్ సందేహం తీరేలా చూడాలని కోరాడు. తర్వాత రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ మధ్య కూడా కొద్దిసేపు చర్చ జరిగింది.


చివరకు అంపైర్లు బ్యాటర్‌‌ను శాంతపరిచి ఆటను తిరిగి ప్రారంభించారు. ఈ ఘటన మైదానంలోన ప్రేక్షకులను, టీవీలో చూస్తున్న అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అర్ధం కాక.. కొందరు అయోమయానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. టిమ్ డేవిడ్ అంపైర్లతో కాసేపు బంతాట ఆడాడు అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 16 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Updated Date - Apr 13 , 2026 | 12:08 PM