శ్రీలంక ప్లేయర్‌తో వివాదం.. వైభవ్‌కు బీసీసీఐ షాక్!
ABN , Publish Date - Jun 17 , 2026 | 07:17 PM
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. లంక ప్లేయర్‌ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత యువ ప్లేయర్ వైభవ్ సూర్యంశీ.. లంక ప్లేయర్‌ను తోసేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతోపాటు భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. ఈ అంశాలపై బీసీసీఐ కఠినంగా వ్యవహరించింది. మైదానంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం, తిలక్ వర్మ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది.
మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ ఫిర్యాదు మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు శ్రీలంక ప్లేయర్లపై లంక క్రికెట్ బోర్డు కూడా చర్యలు తీసుకుంది. ఈ వివాదానికి కారణమైన విషేన్ హలంబగేపై 50 శాతం, వికెట్ కీపర్ నిరోషాన్ డిక్వెల్లా మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. ఈ మ్యాచ్‌లు అధికారికంగా ఐసీసీ పరిధిలోకి రాకపోయినా, క్రమశిక్షణా అంశాల్లో మాత్రం కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అనుసరించినట్లు సమాచారం. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అమలయ్యే ప్రమాణాలను ‘ఎ’ జట్ల మ్యాచ్‌ల్లోనూ పాటించాలనే సంకేతాలు వచ్చాయి.
అసలేం జరిగిందంటే?
శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో భారత్-ఎ జట్టు ఓటమిపాలైంది. ఈ క్రమంలో లంక ప్లేయర్ హలంబగే భారత బ్యాటర్లపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ.. హలంబగేను తోసేశాడు. అతడు కూడా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇతర ప్లేయర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ దూరంగా తీసుకెళ్లారు. మరోవైపు అతిగా అప్పీల్ చేసినందుకు నిరోషన్ డిక్వెల్లాపై, పలుమార్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు భారత కెప్టెన్ తిలక్ వర్మకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్‌కు లైఫ్‌లైన్.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై దుమారం!
ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం