Share News

ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం

ABN , Publish Date - Jun 17 , 2026 | 02:42 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రియా జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. జోర్డాన్ జట్టుపై 3-1 తేడాతో గెలిచింది. దీంతో 36 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో గెలుపు రుచి చూసింది.

ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం
Austria vs Jordan

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రియా జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. జోర్డాన్ జట్టుపై 3-1 తేడాతో గెలిచింది. దీంతో 36 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో గెలుపు రుచి చూసింది. ఆఖరిసారిగా 1990 ప్రపంచ కప్‌లో ఆస్ట్రియా.. యునైటెడ్ స్టేట్స్‌పై విజయాన్ని అందుకుంది. కాగా ఆరంభం నుంచి ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రియా జట్టు జోర్డాన్‌పై పై చేయి సాధించింది.


ఈ మ్యాచ్ 20వ నిమిషంలో ఆస్ట్రియా ఆధిక్యంలోకి వెళ్లింది. అద్భుతమైన జట్టు సమన్వయంతో సాగిన గేమ్‌ను రొమానో ష్మిడ్ గోల్‌గా మలిచాడు. జేవర్ ష్లాగర్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న అతడు బాక్స్ అంచు నుంచి కొట్టిన షాట్ నేరుగా గోల్‌పోస్ట్ ఎగువ మూలలోకి దూసుకెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో జోర్డాన్ గట్టిగా పోరాడింది. 50వ నిమిషంలో అలీ ఓల్వాన్ వేగవంతమైన కౌంటర్ అటాక్‌ను గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. దీంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. 76వ నిమిషంలో మ్యాచ్ మలుపు తిరిగింది. కార్నర్ కిక్ సందర్భంగా వచ్చిన బంతిని క్లియర్ చేసే ప్రయత్నంలో జోర్డాన్ డిఫెండర్ యజాన్ అరబ్ పొరపాటున తన గోల్‌పోస్ట్‌లోకే మళ్లించాడు. దీంతో ఆస్ట్రియా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు 90వ నిమిషంలో సీనియర్ స్ట్రైకర్ మార్కో అర్నాటోవిక్ చేసిన గోల్‌ను వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష అనంతరం హ్యాండ్‌బాల్ కారణంగా రద్దు చేశారు. అయితే అదనపు సమయంలో అతడు పెనాల్టీని గోల్‌గా మలిచి ఆస్ట్రియా విజయాన్ని ఖాయం చేశాడు.


అంత సులభం కాదు: ఆస్ట్రియా కోచ్

మ్యాచ్ అనంతరం ఆస్ట్రియా కోచ్ రాల్ఫ్ రాంగ్నిక్ మాట్లాడారు. ‘ఇది అత్యంత కఠినమైన పోరు. జోర్డాన్ అద్భుతంగా పోరాడింది. మేం గెలిచాం కానీ ఈ విజయం అంత సులభంగా రాలేదు’ అని తెలిపాడు. ఆస్ట్రియా తన తొలి మ్యాచ్‌లో మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా జట్టుతో జూన్ 22న తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్

అదరగొట్టిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజ‌యం

Updated Date - Jun 17 , 2026 | 02:42 PM