విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:36 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, కోచ్ జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీపై వరల్డ్ బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్, కోచ్ జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండే విరాట్ భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు. కోహ్లీ అపరిమితమైన వేగం, ఉత్సాహం మాత్రమే ఫీల్డింగ్‌లో అతడిని అత్యుత్తమంగా నిలపలేవని జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు.
ఓ పాడ్‌కాస్ట్‌లో అతిథిగా పాల్గొన్న జాంటీ రోడ్స్ కోహ్లీ దూకుడు స్వభావంపై పలు విషయాలను వెల్లడించారు. 'జట్టు విజయపథంలో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఉత్సాహం సహచరుల్లో స్ఫూర్తి నింపుతుంది. ఆ దూకుడు స్వభావం నాకు బాగా నచ్చింది. కానీ పరిస్థితులు అనుకూలించనప్పుడు కోహ్లీ చూపే ఆగ్రహం లేదా నిరాశ డ్రెస్సింగ్ రూమ్‌లోని యువ ప్లేయర్‌పై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉంటూ జట్టును నడిపించడం సీనియర్ ఆటగాడిగా కోహ్లీ ఎంతో ముఖ్యం’ అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, కోహ్లీల మధ్య పోలిక అనవసరమని, ఈ అంశంపై స్పందించడం తనకు ఇష్టం లేదని జాంటీ రోడ్స్ అన్నాడు. ' కోహ్లీకి తన అద్భుతమైన ఫిట్‌నెస్‌తో సచిన్ రికార్డులను అధిగమించగల సామర్థ్యం ఉంది. అయినప్పటికీ వేర్వేరు కాలాల్లో రాణించిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను పోల్చడం సరికాదు. వారిద్దరూ తమదైన శైలిలో భారత క్రికెట్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. వారి విజయాలను ఆస్వాదించాలి. కానీ వారి మధ్య పోలికలు పెట్టకూడదు' అని జాంటీ రోడ్స్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!
అదరగొట్టిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజయం