కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:22 AM
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో సారి విఫలమయ్యాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు.
స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ(బుధవారం) భారత్- ఏ జట్టు అఫ్గానిస్థాన్ -ఏ జట్టుతో తలపడుతోంది. తిలక్ సేన ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పని సరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆశించిన మేర రాణించలేదు. ఇవాళ అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ విషయంలో ఈ బుడ్డోడు డేంజర్ డేంజర్ జోన్లో పడుతున్నాడని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
వైభవ్ తాను ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. వరుసగా 14, 44, 21 పరుగులకే గత మూడు మ్యాచుల్లో వైభవ్ పెవిలియన్ చేరాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రాణించి ఎలాగైనా ఫామ్ అందుకోవాలని భావించిన వైభవ్‌కు నిరాశే ఎదురైంది. ఇవాళ్టి మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు.
28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ ఫరీదూన్ దావూద్జాయ్ బౌలింగ్‌లో ఖాలిద్ తనివాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. త్వరలో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత సీనియర్ జట్టుకు వైభవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్ వరుసగా విఫలమవ్వడం అతడి అరంగేట్రంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. ప్రబ్‌సిమ్రన్తో పాటు ఆయుశ్ బదోని ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపాడు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్-ఏ స్కోర్ 115/2.
ఇవి కూడా చదవండి:
వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!
అదరగొట్టిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజయం