Share News

Swap Proposal Rejected: బంగ్లా క్రికెట్ బోర్డుకు ఐర్లాండ్ షాక్

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:19 PM

టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026లో పాల్గోనేందుకు త‌మ జ‌ట్టును ఇండియాకు పంప‌బోమ‌ని మొండి ప‌ట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను ఐర్లాండ్ తిరస్కరించింది.

Swap Proposal Rejected: బంగ్లా క్రికెట్ బోర్డుకు ఐర్లాండ్ షాక్
Bangladesh vs Ireland

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026లో పాల్గొనేందుకు త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంప‌బోమ‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) ఐసీసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే.. బీసీబీ లేఖపై ఐసీసీ సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే బంగ్లా క్రికెట్ బోర్డుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడతామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు(Ireland) స్పష్టం చేసింది.


టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీలో బంగ్లాదేశ్(Bangladesh) గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం.. బంగ్లా జట్టు తమ గ్రూప్ మ్యాచ్‌లన్నీ కోల్‌కతా, ముంబై వేదికల్లో ఆడాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ.. ఈ మెగా టోర్నీ కోసం భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం బీసీబీ, ఐసీసీల మధ్య ఓ కీలక సమావేశం జరిగింది. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి ఐసీసీ హామీ ఇచ్చింది. అందుకు అంగీకరించని బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ గ్రూప్‌ను మార్పు చేయాలని కోరింది.


అయితే.. బంగ్లా క్రికెట్ ప్రతిపాదనపై తాజాగా క్రికెట్ ఐర్లాండ్(సీఐ) స్పందించింది. గ్రూప్ స్వాపింగ్(Swap Groups) ప్రతిపాదనకు ఐర్లాండ్ నో చెప్పింది. ఈ విషయమై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. తాము తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతామని స్పష్టం చేశారు. తమ గ్రూప్ స్టేజ్ మ్యాచులన్నీ శ్రీలంకలోనే జరుగుతాయని చెప్పుకొచ్చారు.

కాగా.. ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుంది. ఐర్లాండ్ గ్రూప్-బిలో ఉంది. దానితో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఒమన్ దేశాలు అదే గ్రూపులో ఉన్నాయి. గ్రూప్-సిలో బంగ్లాదేశ్ సహా వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్ జట్లు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

7 పరుగులకే 5 వికెట్లు.. మ్యాచ్ చివర్లో అదిరే ట్విస్ట్.!

యూపీ వారియర్స్ ఘన విజయం..

Updated Date - Jan 18 , 2026 | 05:24 PM