UP Road Accident: యూపీలో పొగమంచుతో ప్రమాదం! పరస్పరం ఢీకొన్న వాహనాలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:33 AM
యూపీలో ఆదివారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా డ్రైవర్లకు ఎదురుగా ఉన్నది స్పష్టంగా కనిపించక.. పలు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. 10 వాహనాలు దెబ్బతిన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర భారత దేశంలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. యూపీలోని అమ్రోహా జిల్లా, షావజ్‌పూర్ గ్రామం వద్ద ఢిల్లీ-లఖ్నవూ రహదారిపై భారీ ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్నవి కనిపించక వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది గాయాలపాలయ్యారు. 10 వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
యాక్సిడెంట్ కారణంగా రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాలా సేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు క్రేన్లను రంగంలోకి దించారు. ధ్వంసమైన వాహనాలను క్రేన్‌తో పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభించారు.
ఇదిలా ఉంటే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేటి ఉదయం పొగమంచు అలుముకుంది. పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 430 మార్కును దాటింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. కాలుష్య కట్టడి కోసం శనివారం నుంచే జీఆర్ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
పాక్‌లో చిక్కుకుపోయిన భారతీయ మహిళ! తిరిగొచ్చేస్తానంటూ వేడుకోలు
ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం