New Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:51 AM
న్యూఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టంగా పొగ అలుముకుంది. వాయు నాణ్యత సూచీ 439కు పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోయింది. ఆదివారం ఉదయం.. రాజధాని వ్యాప్తంగా దట్టమైన పొంగ మంచు పరుచుకోవడంతో ఎదురుగా ఉన్నవేవీ కానరాని పరిస్థితి వచ్చింది. దీంతో పలు రైళ్లు, విమానాల ప్రయాణాలు వాయిదాపడ్డాయి. నేటి ఉదయం 7:30 గంటల సమయంలో ఢిల్లీలో వాయునాణ్యత సూచీ ఏక్యూఐ 439కు చేరింది. కాలుష్యం కట్టడి కోసం ఢిల్లీ అధికార యంత్రాంగం జీఆర్ఏపీ-4 నిబంధనలను శనివారం నుంచి అమలు చేస్తోంది.
ఢిల్లీలోని సఫ్దర్ గంజ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ పూర్తిగా తగ్గిపోయింది. పాలమ్ ప్రాంతంలో 100 మీటర్లకు మించి దూరంలో ఉన్నవేవీ కనిపించని పరిస్థితి నెలకొందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగ మంచు కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు ఎయిర్‌లైన్స్ విమాన జర్నీలను వాయిదా వేశాయి. ఈ విషయంపై కస్టమర్లను కూడా అప్రమత్తం చేశాయి. తమ విమానం ఎప్పుడు బయల్దేరుతుందనేది ఒకసారి చెక్ చేసుకుని ఎయిర్‌పోర్టులకు రావాలని సూచించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 35 శాతం విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి.
అయితే.. ఈ పరిస్థితి ప్రస్తుతం క్రమంగా కుదురుకుంటోందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఉదయం 8 గంటల సమయంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఉత్తర భారతంలో ఢిల్లీతోపాటు బరేలీ, లఖ్నవూ, కుషీనగర్‌లలోనూ దృశ్య మాన్యత పూర్తిగా తగ్గిపోయింది. ఇక అమృత్‌సర్, గోరఖ్‌పూర్‌లలో 100 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించే పరిస్థితి లేదని ఐఎమ్‌డీ తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లో 200 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించనంతగా పొగ మంచు అలుముకుందని పేర్కొంది.
పొగ మంచు కారణంగా రైళ్ల సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడింది. రాజధాని, దురంతో, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వంటి అనేక రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.
ఇవీ చదవండి:
పాక్‌లో చిక్కుకుపోయిన భారతీయ మహిళ! తిరిగొచ్చేస్తానంటూ వేడుకోలు
కర్ణాటకలో బాలుడికి భారీగా బంగారు నాణేలు లభ్యం.. రంగంలోకి ప్రభుత్వం