Kollam Vigilance Court: శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక
ABN , Publish Date - Jan 18 , 2026 | 06:04 AM
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు తాపడాల అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కొల్లాం, జనవరి 17: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు తాపడాల అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయ ద్వార బంధాలు, వివిధ కళాఖండాలపై ఉన్న బంగారు పూతకు సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్‌సీ) రూపొందించిన శాస్త్రీయ విశ్లేషణ నివేదికను కొల్లాం విజిలెన్స్ కోర్టు తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అందజేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు సిద్ధం చేసిన ఈ నివేదికను వీఎ్‌సఎ్‌ససీ నిపుణులు సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించగా, దానిని శుక్రవారం దర్యాప్తు అధికారులకు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టి 2019లో పునరుద్ధరణ పనుల నిమిత్తం బంగారు తాపడం ఉన్న రాగి పలకలను తీసుకెళ్లారు. అయితే, ఆ పలకలపై ఉన్న బంగారం నాణ్యత ఆయన తీసుకెళ్లక ముందు ఎలా ఉంది, తిరిగి తెచ్చిన తర్వాత ఎలా ఉంది అనే అంశాలను శాస్త్రీయంగా పోల్చి చూడాలని సిట్ కోరడంతో హైకోర్టు ఈ పరీక్షలకు ఆదేశించింది.