ఫిఫాలో 64 జట్లు.. భారత్‌కు అవకాశం వస్తుందేమో కానీ!: బైచుంగ్ భుటియా
ABN , Publish Date - Jul 18 , 2026 | 04:28 PM
ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 64కు పెంచితే భారత్‌కు అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడతాయని భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 64కు పెంచితే భారత్‌కు అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడతాయని భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భుటియా అభిప్రాయపడ్డాడు. అయితే జట్ల సంఖ్య పెరిగిందని మాత్రమే భారత్‌కు వరల్డ్ కప్ బెర్త్ ఖాయమవదని, దేశీయ ఫుట్‌బాల్ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని అతడు స్పష్టం చేశాడు. అదే సమయంలో ఈ నిర్ణయం వరల్డ్ కప్ నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించాడు.
‘భారత ఫుట్‌బాల్ అభిమానిగా, ఒక ప్లేయర్‌గా చూస్తే 64 జట్లతో వరల్డ్ కప్ నిర్వహించడం స్వాగతించదగ్గ నిర్ణయమే. 48 జట్లతో పోలిస్తే 64 జట్లు ఉంటే భారత్‌కు అర్హత సాధించే అవకాశాలు పెరుగుతాయి. కానీ అంత మాత్రాన భారత్ ఆటోమేటిక్‌గా వరల్డ్ కప్‌నకు చేరుతుందని చెప్పలేం. గ్రాస్‌రూట్ స్థాయి నుంచి వ్యవస్థను బలోపేతం చేయాలి. ఎక్కువ మంది పిల్లలను ఫుట్‌బాల్ వైపు ఆకర్షించాలి. ప్రతిభావంతులైన ఆటగాళ్లను తీర్చిదిద్దాలి. ముందుగా అండర్-17, అండర్-20 ప్రపంచ కప్‌లకు నిరంతరం అర్హత సాధించే స్థాయికి చేరుకోవాలి. ఉజ్బెకిస్థాన్, మొరాకో వంటి దేశాలు ఇదే విధానాన్ని అనుసరించి విజయమంతమయ్యాయి’ అని భుటియా వివరించాడు.
మహిళల జట్టుకే ఎక్కువ అవకాశాలు
భారత పురుషుల జట్టుతో పోలిస్తే మహిళల జట్టుకు వరల్డ్ కప్ అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భూటియా అభిప్రాయపడ్డాడు. 2031 మహిళల వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్యను 32 నుంచి 48కు పెంచనున్న నేపథ్యంలో భారత్‌కు అవకాశం మెరుగవుతుందని ఆయన చెప్పారు. ‘మహిళల ఫుట్‌బాల్‌పై మరింత పెట్టుబడి పెట్టాలి. ఇండియన్ ఉమెన్స్ లీగ్‌లో జట్ల సంఖ్య పెరగాలి. వయోపరిమితి వారీగా లీగ్‌లు నిర్వహించాలి. గ్రాస్‌రూట్ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. మహిళా ప్లేయర్లకు పూర్తి స్థాయి వృత్తి పరమైన అవకాశాలు కల్పిస్తేనే వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెలను ఫుట్‌బాల్ వైపు ప్రోత్సహిస్తారు’ అని సూచించాడు.
2030 ఫిఫా వరల్డ్ కప్‌ను 64 జట్లతో నిర్వహించాలని దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య (కాన్‌మెబోల్) ప్రతిపాదించగా, దీనిపై ఫిఫా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 2026లో 48 జట్లతో వరల్డ్ కప్ కొనసాగుతోంది. ఈ టోర్నీ అనంతరం ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
మెస్సి, రొనాల్డోలపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్
ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్