Share News

వన్డే ప్రపంచ కప్‌ 2027: స్క్వాడ్ సైజ్‌ను పెంచండి.. ఐసీసీకి ఆసీస్ కోచ్ విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 29 , 2026 | 04:56 PM

వన్డే ప్రపంచ కప్ 2027 నిర్వహణలో ఐసీసీ చేసిన మార్పులపై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు. జట్ల సంఖ్య పెంచినట్లే.. ఒక్కో జట్టులో ప్లేయర్ల సంఖ్య కూడా పెంచాలని ఐసీసీని కోరాడు.

వన్డే ప్రపంచ కప్‌ 2027: స్క్వాడ్ సైజ్‌ను పెంచండి.. ఐసీసీకి ఆసీస్ కోచ్ విజ్ఞప్తి
2027 ODI World Cup

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027 నిర్వహణలో ఐసీసీ చేసిన మార్పులపై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు. జట్ల సంఖ్య పెంచినట్లే.. ఒక్కో జట్టులో ప్లేయర్ల సంఖ్య కూడా పెంచాలని ఐసీసీని కోరాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో 14 జట్లు పాల్గొననున్నాయి. కొత్త ఫార్మాట్ కారణంగా ఫైనల్ చేరే జట్టు కనీసం 13 మ్యాచ్‌లు, కొన్ని పరిస్థితుల్లో 15 మ్యాచ్‌ల వరకు ఆడాల్సి వస్తుంది.


‘ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 15 మంది సభ్యుల జట్టు సరిపోదు. ఎక్కువ మ్యాచ్‌లు, భిన్నమైన వాతావరణ పరిస్థితులు, గాయాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కనీసం 17 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఐసీసీ అనుమతి ఇవ్వాలి. 2023 ప్రపంచ కప్‌లో ట్రావిస్ హెడ్ గాయపడటంతో ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఐసీసీ నిబంధనల కారణంగా అతడిని జట్టు నుంచి తొలగించలేకపోయాం. దాంతో తొలి మ్యాచ్‌ల్లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగే అవకాశం లేకుండా పోయింది. న్యూజిలాండ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది’ అని మెక్‌డొనాల్డ్ వెల్లడించాడు.


ఫిఫాలో కూడా..

‘రానున్న ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియా 14 నెలల్లో 20కుపైగా టెస్టులు ఆడాల్సి ఉంది. భారత్, ఇంగ్లండ్ పర్యటనలు కూడా ఉండటంతో ఆటగాళ్లపై పని భారం మరింత పెరుగుతుంది. కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి కీలక బౌలర్లు ఇప్పటికే గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌లో నిర్వాహకులు 26 మంది సభ్యులతో జట్టుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండాలంటే ఐసీసీ కూడా జట్ల పరిమాణాన్ని పెంచే అంశంపై సానుకూలంగా ఆలోచించాలి’ అని మెక్‌డొనాల్డ్ ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్

Updated Date - Jul 29 , 2026 | 04:56 PM