Share News

ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో సంచలనం.. అసలేంటీ ‘క్లికీ పాంటింగ్’ వివాదం?

ABN , Publish Date - Jul 29 , 2026 | 04:09 PM

ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదానికి అభిమానులు ‘క్లిక్‌గేట్’, ‘క్లికీ పాంటింగ్’ అనే పేర్లు పెట్టారు. అసలు ఈ వివాదానికి ఆ పేర్లు ఎందుకు పెట్టారనే ప్రశ్న చాలామందిలో మొదలైంది.

ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో సంచలనం.. అసలేంటీ ‘క్లికీ పాంటింగ్’ వివాదం?
Clicky Ponting

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్‌కు చెందిన ఓ ఫీల్డర్ బ్రియాన్ డివైన్.. బంతి బ్యాట్‌కు తగలకపోయినా వేళ్లతో చిటికె వేసి శబ్దం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి అభిమానులు ‘క్లిక్‌గేట్’, ‘క్లికీ పాంటింగ్’ అనే పేర్లు పెట్టారు. అసలు ఈ వివాదానికి ఆ పేర్లు ఎందుకు పెట్టారనే ప్రశ్న చాలామందిలో మొదలైంది.


సోషల్ మీడియాలో అభిమానులు బ్రియాన్ డివైన్‌పై వ్యంగ్యంగా స్పందిస్తూ క్లికీ పాంటింగ్ అనే పేరు పెట్టారు. వేళ్లతో ‘క్లిక్’ అన్నట్లు చేసిన శబ్దాన్ని ఉద్దేశించి ‘రికీ’ స్థానంలో ‘క్లికీ’ అని మార్చి పెట్టారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరు వచ్చేలా రికీ స్థానంలో క్లికీ అని పెట్టి దాన్ని ‘క్లికీ పాంటింగ్’ అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఘటనతో పాంటింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆటలో వ్యూహాలు మార్చే ప్లేయర్‌గా గతంలో అతడికి పేరుంది. దాన్నే ఆధారంగా చేసుకుని ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.


అసలు ఏమైందంటే?

నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ (NYSD) క్రికెట్ లీగ్ డివిజన్-2లో సాల్ట్‌బర్న్ క్లబ్, నార్టన్ క్లబ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సాల్ట్‌బర్న్ స్లిప్ ఫీల్డర్ బ్రియాన్ డివైన్.. బ్యాటర్ నోమన్ షబీర్ బ్యాట్ పక్కగా బంతి వెళ్లే సమయంలో వేళ్లతో ‘క్లిక్’ శబ్దం చేశాడు. అది బ్యాట్‌కు బంతి తగిలినట్లుగా వినిపించడంతో వికెట్ కీపర్ క్యాచ్ అందుకుని అప్పీల్ చేశాడు. డీఆర్‌ఎస్, అల్ట్రా ఎడ్జ్ వంటి సాంకేతిక సదుపాయాలు లేకపోవడంతో అంపైర్ బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న లీగ్ నిర్వాహకులు విచారణ ప్రారంభించారు.


ఈ ఘటన వైరల్ కావడంతో సాల్ట్‌బర్న్ వికెట్‌ కీపర్ జోష్ బోవ్స్ గణాంకాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ సీజన్‌లో కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లోనే అతడు 31 క్యాచ్‌లు పట్టడం అనుమానాలకు తావిచ్చింది. ఒక మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు పట్టగా, పురుషుల టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్ అత్యధిక క్యాచ్‌ల రికార్డు ఏడు మాత్రమే ఉండటం విశేషం. మరోవైపు, ఇలాంటి ఘటనలు తమ జట్టుపైనా జరిగాయని ప్రత్యర్థి క్లబ్ కెప్టెన్ రోరీ కాటెరిల్ ఆరోపించాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్

Updated Date - Jul 29 , 2026 | 04:09 PM