ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో విచిత్ర మోసం.. అంపైర్లను బురిడీ కొట్టించిన ప్లేయర్!
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:28 PM
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో వెలుగు చూసిన ఓ విచిత్ర మోసం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఓ ప్లేయర్ వేలితో శబ్దం చేస్తూ అంపైర్లను బురిడీ కొట్టించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో వెలుగు చూసిన ఓ విచిత్ర మోసం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవన్ జట్టుకు చెందిన ఓ ఫీల్డర్.. బంతి ప్రత్యర్థి బ్యాటర్ బ్యాట్‌కు తాకకపోయినా వేళ్లతో చిటికె వేసి శబ్దం సృష్టించాడు. నిజంగానే బ్యాట్‌కు బంతి తగిలిందని భ్రమపడిన అంపైర్లు బ్యాటర్లను క్యాచ్ ఔవుట్‌గా ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సాల్ట్‌బర్న్ క్లబ్ ఆటగాడు బ్రియాన్ డివైన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
బ్రియాన్ డివైన్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ బంతి బ్యాట్‌ను దాటి వెళ్లే సమయంలో చిటికె వేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో పోలుస్తూ..'క్లిక్కీ పాంటింగ్' అని వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మిడిల్స్ బ్రో క్లబ్ సెకండ్ ఎలెవన్ జట్టు కెప్టెన్ స్పందిస్తూ.. ఇలాంటి పనుల వల్ల గతంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారని ఆరోపించారు. ఈ వివాదం ముదరడంతో నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హమ్ క్రికెట్ లీగ్ దీనిపై అధికారికంగా దర్యాప్తునకు ఆదేశించింది.
ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రియాన్ డివైన్‌కు బిగ్ షాక్ తగిలింది. స్థానికంగా ఉన్న 'స్పైసెస్' అనే ఇండియన్ రెస్టారెంట్ అతడి స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసింది. ప్రముఖ టెలివిజన్ యాంకర్ పియర్స్ మోర్గన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. 'ఇది నమ్మశక్యం కాని విషయం. క్రికెట్ చరిత్రలోనే క్లిక్కీ పాంటింగ్(డివైన్) అతిపెద్ద చీటర్ అయి ఉంటాడు' అంటూ తీవ్రంగా మండిపడ్డారు. విచారణ పూర్తయిన తర్వాత అతడిపై లీగ్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ చెత్త రికార్డు.. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో పరాజయం
కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..