హార్దిక్‌ను ట్రేడ్ చేస్తే.. ఆ ఇద్దరినీ జట్టులోకి తీసుకోండి.. ఎంఐకి అశ్విన్ సూచన
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:16 AM
హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్ లేదా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పంపేందుకు ఎంఐ ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడ్‌పై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే సీజన్‌కు ముందు హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్ లేదా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పంపేందుకు ఎంఐ ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌ను కేకేఆర్‌కు ట్రేడ్ చేస్తే.. ప్రతిగా హర్షిత్ రాణా, రింకు సింగ్‌ను తీసుకోవాలని ముంబైకి సూచించాడు.
‘హార్దిక్ కేవలం సీఎస్కే లేదా కేకేఆర్‌లోనే చేరతాడని అనుకోవద్దు. సీఎస్కే నుంచి శివమ్ దూబెతో పాటు మరో పేసర్ వస్తాడనే చర్చ జరుగుతోంది. కేకేఆర్ నుంచి కామెరూన్ గ్రీన్‌ను ఇచ్చే అవకాశం ఉంది. అయితే గ్రీన్ వచ్చే ఏడాది యాషెస్‌పై దృష్టి పెడితే పరిస్థితి ఏంటి? నేను ముంబై ఇండియన్స్‌కి ఇచ్చే సూచన ఒక్కటే.. కేకేఆర్‌తో ఒక్క షరతుపై హార్దిక్‌ను ట్రేడ్ చేయాలి. హర్షిత్ రాణా, రింకు సింగ్ ఇద్దరినీ జట్టులోకి తీసుకోవాలి. అప్పుడే ముంబై మరింత బలపడుతుంది. హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుంటే సీఎస్కే కంటే కేకేఆర్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. హార్దిక్ కేకేఆర్‌లో చేరితే ఆ జట్టు మరింత ప్రమాదకరంగా మారుతుంది. బ్యాటింగ్ విభాగం చాలా బలంగా తయారవుతుంది. సీఎస్కే.. దూబె, ఓ పేసర్‌ను ఇచ్చి హార్దిక్‌ను తీసుకుంటే బలపడుతుంది కానీ అజేయంగా మారదు. అందుకే ముంబై.. హార్దిక్ వెళ్లే జట్టు తమకంటే ముందుకు వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలో ఆలోచించాలి’ అని అశ్విన్ సూచించాడు.
హార్దిక్ పాండ్య 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2022 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి.. ఆ జట్టుకు తొలి సీజన్‌లోనే టైటిల్ అందించాడు. అనంతరం ముంబై తిరిగి అతడిని జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. 2024లో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా.. 2025లో క్వాలిఫయర్-2 వరకు చేరుకుంది. 2026 సీజన్‌లో మాత్రం తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
స్థలం గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది.. ఉత్తరాఖండ్ సీఎంను ట్యాగ్ చేసి పంత్ ట్వీట్
ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె