Share News

తొలిరోజు వారిదే

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:57 AM

శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌లో తొలిరోజు భారత బౌలర్లు చెమటోడ్చారు. క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటర్‌ దీటుగా ఆడడంతో లంక మొదటి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే..

తొలిరోజు వారిదే

  • లంక ఎలెవన్‌ మొదటి ఇన్నింగ్స్‌ 363/8

  • తేలిపోయిన భారత బౌలర్లు జూవామప్‌ మ్యాచ్‌

కొలంబో: శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌లో తొలిరోజు భారత బౌలర్లు చెమటోడ్చారు. క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటర్‌ దీటుగా ఆడడంతో లంక మొదటి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్లు రవీందు రసంత (71), నిషాన్‌ మదుష్క (66), కెప్టెన్‌ సోనాల్‌ దినుష (52) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత్‌ నుంచి ఏడుగురు బౌలింగ్‌ చేయగా.. కుల్దీప్‌, జడేజా, మానవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. కొత్త బౌలర్‌ సారాంశ్‌ ప్రభావం చూపలేకపోయాడు. ప్రస్తుతం క్రీజులో నువంత (9 బ్యాటింగ్‌), సుదీర (1 బ్యాటింగ్‌) ఉన్నారు.

శతక భాగస్వామ్యం: ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఓపెనర్లు రవీందు, నిషాన్‌ స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 21వ ఓవర్‌లో నిషాన్‌ రనౌట్‌ కావడంతో తొలి వికెట్‌కు 110 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత సూరియబందర (35)తో కలిసి రవీందు రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. మిడిలార్డర్‌లో పవన్‌ రత్నాయకే (39), విక్రమసింఘే (31) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ సోనాల్‌ ఏడో వికెట్‌కు రమేశ్‌ మెండిస్‌ (32)తో కలిసి 63 పరుగులు రాబట్టి బౌలర్లను విసిగించాడు. ఆట చివర్లో బౌలర్లు మూడు ఓవర్ల వ్యవధిలో రెండు వికెట్లు తీసి ఊరటనిచ్చారు.

  • సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 90 ఓవర్లలో 363/8 (రవీందు రసంత 71, నిషాన్‌ మదుష్క 66, సోనాల్‌ దినుష 52; మానవ్‌ 2/33, జడేజా 2/64, కుల్దీప్‌ 2/76).


టెస్టు మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం

భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ కోసం ప్రేక్షకులకు శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లను వారు ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. ఈనెల 15 నుంచి గాలె అంతర్జాతీయ మైదానంలో తొలి టెస్టు, 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు జరుగనుంది. ఈ అవకాశాన్ని క్రికెట్‌ ప్రేమికులు, యువ ఆటగాళ్లు, వారి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఎల్‌సీ కోరింది. శ్రీలంకలో టెస్టు మ్యాచ్‌లకు ఆదరణ చాలా తక్కువ. ఆ పరిస్థితిని ఇలాగైనా మార్చాలని బోర్డు భావిస్తోంది.


బరిలోకి దిగని గిల్‌

భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వామప్‌ మ్యాచ్‌ తొలి రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో రాహుల్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో గిల్‌ రెండుసార్లు గాయపడ్డాడు. అయితే బ్యాటింగ్‌ సమయంలో తన కుడిచేతి వేలుకు అయిన గాయం తీవ్రంగా ఉండడంతో అతను శుక్రవారం ఆటలో బరిలోకి దిగలేదని బీసీసీఐ పేర్కొంది. అలాగే గిల్‌ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపింది. రెండో రోజు ఫిట్‌గా ఉంటే ఆడే అవకాశం ఉంది.

Untitled-3 copy.jpg

Updated Date - Aug 08 , 2026 | 01:03 AM