కుల్‌దీప్ యాదవ్ చేసిన తప్పేంటి?.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 28 , 2026 | 09:42 PM
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుల్‌దీప్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుల్‌దీప్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి స్థానంలో సారాంశ్ జైన్‌ను ఆడించడాన్ని అశ్విన్ ప్రశ్నించాడు. ఈ మేరకు అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘చాలామంది కుల్‌దీప్ యాదవ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. మరికొందరు ‘గత మ్యాచ్‌లో అతడు ఏం చేశాడు?’ అని ప్రశ్నిస్తున్నారు. ఒక ఆటగాడి కోణంలో చూస్తే.. ప్రస్తుతం కుల్‌దీప్ ఆత్మవిశ్వాసం అత్యల్ప స్థాయిలో ఉంది. పాతాళంలోకి వెళ్లి వెతికినా దొరకనంత తక్కువగా ఉంది. 60వ ఓవర్ నుంచి 80వ ఓవర్ వరకు జడేజా బౌలింగ్ చేస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో పరుగులు చేయడం బ్యాటర్లకు కష్టంగా ఉంటుంది. కానీ అదే సమయంలో స్పిన్నర్‌కు కూడా బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. అయినప్పటికీ అదనపు స్పెల్ కూడా ఇవ్వకుండా ఉండటం దురదృష్టకరం. శ్రీలంక బ్యాటర్ దినుషాతో టెయిల్‌ఎండర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కుల్‌దీప్ యాదవ్ తన గూగ్లీ, లెగ్‌బ్రేక్‌లతో బౌలింగ్ చేసి ఉంటే ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కనిపించేది. కుల్‌దీప్ అసలు ఏం తప్పు చేశాడు? అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదు? అతడి గురించి నాకు నిజంగా బాధగా ఉంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
తదుపరి టెస్టులో ఆడిస్తారు.. కానీ!
‘ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్ తదుపరి టెస్టు సిరీస్‌లో కుల్‌దీప్‌ను ఆడిస్తుంది. కానీ చేసిన తప్పును మార్చుకోవడం కుదురదు. తొలి టెస్టుకు, రెండో టెస్టుకు సంబంధం లేదు. మీరు ఇప్పటికే తొలి టెస్టు గెలిచారు. కాబట్టి అతడిపై నమ్మకం ఉంచి రెండో మ్యాచ్‌కు కొనసాగించవచ్చు. కానీ అలా జరగలేదు’ అని అశ్విన్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!
అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు