Share News

నాన్నకు భారీ సెంచరీలంటేనే ఇష్టం.. మాటిచ్చి నిలబెట్టుకున్నా: ఆర్యవీర్ సెహ్వాగ్

ABN , Publish Date - Nov 10 , 2026 | 09:44 PM

భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈపై 160 పరుగులతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ ఇన్నింగ్స్ వెనుక ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆర్యవీర్ తాజాగా వెల్లడించాడు.

నాన్నకు భారీ సెంచరీలంటేనే ఇష్టం.. మాటిచ్చి నిలబెట్టుకున్నా: ఆర్యవీర్ సెహ్వాగ్
Aryaveer Sehwag

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈపై 160 పరుగులతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ ఇన్నింగ్స్ వెనుక ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆర్యవీర్ తాజాగా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వీరేంద్ర సెహ్వాగ్‌కు భారీ సెంచరీ చేస్తానని మాటిచ్చినట్లు తెలిపాడు. యూఏఈపై 168 బంతుల్లో 160 పరుగులు చేసి భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చడంలో ఆర్యవీర్ కీలక పాత్ర పోషించాడు.


‘నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడే ఎక్కువసేపు క్రీజులో ఉండాలని అనుకున్నా. 40 నుంచి 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలనేది నా లక్ష్యం. పిచ్‌పై బంతి టర్న్ అవుతూ కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ అంతా బాగానే జరిగింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. మొదట్లో డాట్ బాల్స్ వచ్చినా పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నా. నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. ఆ డాట్ బాల్స్‌కు తర్వాత పరుగులు సాధించి భర్తీ చేయగలనని భావించా. ఈరోజు భారీ స్కోరు చేస్తానని ఒక వ్యక్తికి మాటిచ్చా. ఆయనే మా నాన్న వీరేంద్ర సెహ్వాగ్. ఎందుకంటే ఆయన పెద్ద సెంచరీలను మాత్రమే గౌరవిస్తారు. 100 పరుగులు చేసినా సరిపోదు.. 150 పరుగులు చేస్తేనే ఆయనకు సంతోషం, గౌరవం. అందుకే ఈరోజు అలా భారీ స్కోరు చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని ఆర్యవీర్ నవ్వుతూ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

అండర్ 19 ఆసియా కప్: యూఏఈపై ఘన విజయం.. సెమీ ఫైనల్‌కు భారత్

ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు?.. బీసీసీఐ ప్లాన్ అదేనా!

Updated Date - Nov 10 , 2026 | 09:44 PM