ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు?.. బీసీసీఐ ప్లాన్ అదేనా!
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:14 PM
ఐపీఎల్‌లో మరోసారి జట్ల సంఖ్య పెరగనుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2028 సీజన్ నుంచి ఐపీఎల్‌లో మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను చేర్చాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరోసారి జట్ల సంఖ్య పెరగనుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2028 సీజన్ నుంచి ఐపీఎల్‌లో మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను చేర్చాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పుణె, వడోదర నగరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని వార్తలు వస్తున్నాయి.
ఒక్కో జట్టు విలువ రూ. వేల కోట్లు!
ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, ఫ్రాంచైజీల విలువ భారీగా పెరగడంతో కొత్త జట్ల ఏర్పాటుపై పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొన్నట్లు సమాచారం. కొత్తగా వచ్చే ఒక్కో ఫ్రాంచైజీ విలువ 100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8,800 కోట్లకు పైగా) చేరవచ్చని అంచనా. 2028 నుంచి 2032 వరకు అమల్లోకి రానున్న తదుపరి మీడియా హక్కుల ఒప్పందంతో ఈ విస్తరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పెర్మిరా, పశ్చిమాసియా సావరిన్ వెల్త్ ఫండ్స్, ఆసియా ప్రభుత్వ పెట్టుబడి సంస్థలు, అమెరికాకు చెందిన ఫ్యామిలీ ఆఫీసులు, భారతీయ పారిశ్రామిక సంస్థలు కొత్త జట్లపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కొంతమంది అత్యంత సంపన్నులు కూడా మైనారిటీ వాటాల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పుణెకు ఐపీఎల్‌తో పాత అనుబంధం!
కొత్త ఫ్రాంచైజీల కోసం పరిశీలిస్తున్న పుణె నగరానికి ఐపీఎల్‌తో ఇప్పటికే అనుబంధం ఉంది. 2011 నుంచి 2013 వరకు పుణె వారియర్స్ ఇండియా జట్టు టోర్నీలో పాల్గొంది. అయితే బీసీసీఐతో ఆర్థిక వివాదం కారణంగా ఆ జట్టు ఐపీఎల్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు బరిలోకి దిగింది. 2017లో ఫైనల్‌కు చేరిన ఆ జట్టు.. ముంబై ఇండియన్స్ చేతిలో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఇక వడోదరను కొత్త ఫ్రాంచైజీ కేంద్రంగా ఎంపిక చేస్తే గుజరాత్ క్రికెట్‌కు మరింత ప్రాధాన్యం లభించనుంది. ఐపీఎల్‌లో చివరిసారిగా 2022 సీజన్‌కు ముందు జట్ల సంఖ్య పెరిగింది. అప్పుడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్త ఫ్రాంచైజీలుగా టోర్నీలోకి అడుగుపెట్టాయి. దీంతో మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. ఇప్పుడు మరో రెండు జట్లు వస్తే ఐపీఎల్‌లో జట్ల సంఖ్య 12కు పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
శాండ్‌పేపర్ వివాదం: నాకైతే తెలియదు.. ఖవాజా ఆరోపణలకు స్టార్క్ కౌంటర్!
అండర్ 19 ఆసియా కప్: ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం.. యూఏఈపై 160 పరుగులతో..