ఏడాదిన్నర పాటు డిప్రెషన్‌లోనే.. మాట్లాడేందుకు ఎవరూ లేరు: అమిత్ మిశ్రా
ABN , Publish Date - Oct 25 , 2026 | 09:39 AM
క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా తాజాగా వెల్లడించాడు. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత ఏడాదిన్నర పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాయని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా తాజాగా వెల్లడించాడు. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత ఏడాదిన్నర పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాయని తెలిపాడు. ఐపీఎల్ 2027కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా అమిత్ మిశ్రా నియమితుడైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతడు పలు విషయాలు పంచుకున్నాడు.
‘దేశం తరఫున ఆడిన ఆనందం ఎంతోకాలం నిలవలేదు. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత నా కెరీర్ ఒక్కసారిగా గందరగోళంలో పడింది. ఏడాదిన్నర పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నా తప్పేంటని పదేపదే ఆలోచించేవాడిని. అన్ని చోట్లా క్రికెట్ ఆడుతున్నా.. అసలు నేనేం తప్పు చేశాననే ప్రశ్నే నా మనసులో తిరుగుతుండేది. ఆ సమయంలో నా బాధను పంచుకునేందుకు నాతో ఎవరూ లేరు. కుటుంబ సభ్యులతో చెప్పుకుందామంటే వాళ్లు టెన్షన్ పడతారేమో అనిపించేది. ఆ దశ నాకు అత్యంత క్లిష్టంగా గడిచింది’ అమిత్ మిశ్రా వెల్లడించాడు.
దేశవాళీ క్రికెట్‌లోనూ ఎదురుదెబ్బలు
భారత జట్టుకు ఆడినప్పటికీ.. ఆ తర్వాత దులీప్ ట్రోఫీ జట్టులోనూ, జోనల్ విభాగానికి సంబంధించిన ఇండియా-ఎ జట్టులోనూ మిశ్రాకు చోటు దక్కలేదు. ఒక సీజన్‌లో పేలవ ప్రదర్శన అతడి పరిస్థితిని మరింత దిగజార్చింది. ‘నేను భారత్‌కు ఆడాను. కానీ జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీలోనూ చోటు దక్కలేదు. జోనల్ జట్టు నుంచి ఇండియా-ఎకు కూడా ఎంపిక కాలేదు. అసలు నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక సీజన్ సరిగా ఆడలేదు. ఓ సెలెక్టర్ నాతో మాట్లాడుతూ.. నేను సరిగ్గా ప్రదర్శన చేయడం లేదని చెప్పాడు. అప్పుడు కూర్చుని ఆలోచించా. భారత జట్టుకు ఆడాలనే ఆలోచనలోనే ఉన్నానని, కానీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం సరిగ్గా రాణించడం లేదని అర్థం చేసుకున్నా. నేను రాణించనంతవరకు పరిస్థితులు మారవని అర్థం చేసుకున్నా. బ్యాటింగ్‌పైనా దృష్టి పెట్టా. ఆ తర్వాత దులీప్ ట్రోఫీకి ఎంపికయ్యా. అప్పుడే కష్టపడి ప్రదర్శన చేస్తేనే అవకాశాలు వస్తాయని అర్థమైంది. నాకు అండగా నిలిచే గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. కాబట్టి ప్రతిసారీ నా ఆటతోనే నన్ను నేను నిరూపించుకోవాలని తెలుసుకున్నా’ అని మిశ్రా పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
డిసెంబర్‌లోపు నిర్ణయం తీసుకుంటా.. ఐపీఎల్‌లో ఆడటంపై ధోని బిగ్ హింట్!
కివీస్‌పై భారత్ ఉత్కంఠ విజయం.. తిలక్, నితీశ్ పోరాటానికి గంభీర్ ఫిదా!