Share News

హార్దిక్ పాండ్య లేకపోయినా ముంబైకి పెద్దగా నష్టం లేదు: ఆకాశ్ చోప్రా

ABN , Publish Date - Nov 08 , 2026 | 06:07 PM

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ లేకపోయినా ముంబైకి పెద్దగా నష్టంగా ఉండదని తెలిపాడు.

హార్దిక్ పాండ్య లేకపోయినా ముంబైకి పెద్దగా నష్టం లేదు: ఆకాశ్ చోప్రా
Akash Chopra

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య త్వరలో పంజాబ్ కింగ్స్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ట్రేడ్‌లో భాగంగా పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు రానున్నట్లు సమాచారం. హార్దిక్‌ను పంజాబ్ కింగ్స్‌కు పంపేందుకు ఇరు ఫ్రాంచైజీలు దాదాపుగా అంగీకారానికి వచ్చాయి. అత్యంత త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా స్పష్టత రానుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ లేకపోయినా ముంబైకి పెద్దగా నష్టంగా ఉండదని తెలిపాడు.


‘ముంబై ఇండియన్స్‌ది చాలా బలమైన జట్టు. హార్దిక్ వెళ్లిపోతే అతడిని ముంబై జట్టు అస్సలు మిస్ అవ్వదు. ఇలా మాట్లాడుతున్నందుకు నాపై కోపం తెచ్చుకోకండి. హార్దిక్ పాండ్య అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. కానీ వాస్తవం ఏమిటంటే ముంబై అతడు లేకపోయినా పరిస్థితులను చక్కదిద్దుకోగలదు. రోహిత్ శర్మతో కలిసి ర్యాన్ రికెల్టన్ లేదా క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేయవచ్చు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, నమన్ ధీర్ వంటి బ్యాటర్లు ఉన్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్ గురించి బెంగే లేదు. పరిస్థితులను బట్టి ఇప్పుడు విల్ జాక్స్‌ను కూడా సులభంగా తుది జట్టులోకి తీసుకోవచ్చు’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.


హార్దిక్‌తో పాటు ముంబై ఇండియన్స్ మరో కీలక ఆటగాడు ట్రెంట్ బౌల్ట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఈ ఇద్దరినీ వదులుకోవచ్చని పేర్కొన్నాడు. ఒకవేళ అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులోకి వస్తే పేస్ విభాగానికి మంచి బలం చేకూరుతుంది. ముఖ్యంగా కొత్త బంతితో వికెట్లు తీయడంలో అర్ష్‌దీప్ సామర్థ్యం ముంబైకి ఉపయోగపడనుంది. హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్‌లో చేరినా కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం అతడికి అప్పగించే అవకాశం లేదని సమాచారం. వచ్చే సీజన్‌లోనూ శ్రేయస్ అయ్యర్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల విరామం తర్వాత రోహిత్ శర్మ మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

అందుకే ఓడిపోతున్నారు.. న్యూజిలాండ్ పిచ్‌లపై అంబటి రాయుడు విమర్శలు

అండర్ 19 ఆసియా కప్: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ.. పాక్ టార్గెట్ 209

Updated Date - Nov 08 , 2026 | 06:07 PM