రోహిత్, లక్ష్మణ్‌తో విభేదాలు.. అగార్కర్ పదవి వ్యవహారంలో కీలక విషయాలు!
ABN , Publish Date - Sep 19 , 2026 | 09:32 PM
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై తలెత్తిన వివాదం, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో విభేదాలు, ఇంగ్లండ్ పర్యటనపై జరిగిన సమీక్ష సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడం కీలకంగా మారినట్లు జాతీయ కథనాలు పేర్కొన్నాయి.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య చర్చలు జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్‌ను వన్డే ప్రణాళికల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని రోహిత్‌కు తెలియజేసే బాధ్యతను సౌత్ జోన్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలన్న ఆసక్తితో ఉన్న రోహిత్ ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత బీసీసీఐ నుంచి రోహిత్ భవిష్యత్తుపై అధికారిక ప్రకటన రావడం చర్చనీయాంశమైంది. లార్డ్స్ వన్డేనే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో బీసీసీఐ, అగార్కర్ మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే రోహిత్‌ను కొనసాగించాలన్నది బీసీసీఐ అధికారిక నిర్ణయమా? లేక అప్పటి పరిస్థితుల్లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా? అన్నదానిపై పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడి కాలేదు.
వీవీఎస్ లక్ష్మణ్‌తో విభేదాలు
అగార్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఇద్దరూ గతంలో భారత జట్టుకు కలిసి ఆడిన ప్లేయర్లే. ప్రస్తుతం మాత్రం ఆటగాళ్ల గాయాల నిర్వహణ, ఇండియా-ఎ జట్టు మ్యాచ్‌ల షెడ్యూలింగ్ వంటి అంశాల్లో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గాయపడిన ఆటగాళ్లకు సంబంధించి రిహాబిలిటేషన్, ఫిట్‌నెస్, తిరిగి పోటీల్లోకి వచ్చే సమయం వంటి అంశాలపై సెలెక్షన్ కమిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్య మరింత సమన్వయం అవసరమనే అంశం బీసీసీఐ సమీక్షల్లోనూ చర్చకు వచ్చింది. బీసీసీఐ అధికారిక వివరాల ప్రకారం.. ఆటగాడి గాయం నిర్ధారణ నుంచి అతడు పోటీ క్రికెట్‌కు తిరిగి వచ్చే వరకు CoEలో వైద్య, ఫిట్‌నెస్ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
వన్డేల్లో పంత్‌కు దాదాపు చోటు లేనట్లే: ఆకాశ్ చోప్రా
బహుశా ఇవే నా చివరి ఆసియా క్రీడలు: స్టార్ షట్లర్ ప్రణయ్