Share News

వన్డేల్లో పంత్‌కు దాదాపు చోటు లేనట్లే: ఆకాశ్ చోప్రా

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:31 PM

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ విషయంలో సెలెక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేశారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై మాట్లాడాడు.

వన్డేల్లో పంత్‌కు దాదాపు చోటు లేనట్లే: ఆకాశ్ చోప్రా
Aakash Chopra

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ విషయంలో సెలెక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేశారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోందని అన్నాడు. మరోవైపు ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో మాత్రం అతడిపై సెలెక్టర్లు భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నాడు.


‘రిషభ్ పంత్ టెస్టు క్రికెట్ ఆడుతున్నాడు. రెడ్ బాల్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే అక్కడ కూడా అతడి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను తొలగించారు. కానీ వన్డే క్రికెట్ విషయానికి వస్తే.. మ్యాచ్‌లు ఆడకుండానే అతడికి దాదాపు వీడ్కోలు పలికినట్టుగా ఉంది. ఈ సమయంలో ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు అతడినే కెప్టెన్‌గా నియమించారు. దీన్ని బట్టి టెస్టు క్రికెట్‌లో రిషభ్ పంత్‌ను కీలక పాత్రలో చూడాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. కానీ వైట్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని అనిపిస్తోంది’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.


నాలుగేళ్లలో ఒక్క వన్డే..

రిషభ్ పంత్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎప్పుడూ రెగ్యులర్ సభ్యుడిగా లేడు. గత నాలుగేళ్లలో అతడు కేవలం ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత టీ20 జట్టులోనూ పంత్‌కు చోటు దక్కలేదు. ఇక 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకాలను భారత జట్టు ఇప్పటి నుంచే ప్రారంభించింది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కూడా చోటు కల్పించారు.


ఇవి కూడా చదవండి:

వెస్టిండీస్‌తో సిరీస్‌.. యశస్వికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్

యాడ్ షూట్‌లో గాయపడ్డ కివీస్ ఆల్‌రౌండర్.. భారత్‌తో సిరీస్‌కు దూరం!

Updated Date - Sep 19 , 2026 | 05:31 PM