వెస్టిండీస్‌తో సిరీస్.. యశస్వికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:36 PM
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ 27 నుంచి స్వదేశంలో భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో తాను ప్రత్యేకంగా యశస్వి ఆటను గమనించనున్నట్లు తెలిపాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని యశస్వికి తగినన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.
‘ఈ సిరీస్‌లో నేను ఒక ఆటగాడిపై ప్రత్యేకంగా కన్నేయబోతున్నాను. అతడే యశస్వి జైస్వాల్. ముఖ్యంగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అతడికి ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలని ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం జైస్వాల్ మన జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ సమయానికి బ్యాకప్ ఓపెనర్‌కు తగినన్ని మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకపోవడం సరికాదు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా జైస్వాల్‌ను ఆడించాలి. అతడు క్రమం తప్పకుండా వన్డేలు ఆడుతూ ఉండాలి’ అని పఠాన్ సూచించాడు.
యువ ఆటగాళ్లకు మంచి అవకాశం
‘శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆసియా క్రీడల్లో ఆడుతున్నారు. అందుకే వారు వెస్టిండీస్ సిరీస్‌కు అందుబాటులో లేరు. మిగతా ఆటగాళ్లకు ఇది గొప్ప అవకాశం. దాదాపు రెండో జట్టులా కనిపిస్తున్న ఈ బృందంలో పలువురిని పరీక్షిస్తున్నారు. నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్‌లకు అవకాశాలు లభించనున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు ముందు భారత్ 11 వన్డేలు ఆడనుంది. ఈ సమయంలో బెంచ్ బలాన్ని కూడా పరీక్షించాలి. ఆసియా క్రీడలు, వెస్టిండీస్ సిరీస్ ఒకేసారి రావడం యువ ఆటగాళ్లకు కలిసొచ్చే అంశం’ అని పఠాన్ వెల్లడించాడు.
ఇవీ చదవండి:
ఆసియా గేమ్స్: సెమీ ఫైనల్ గ్రౌండ్‌పై వెల్లువెత్తుతున్న ఆందోళనలు
నేటినుంచే మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్