Share News

యాడ్ షూట్‌లో గాయపడ్డ కివీస్ ఆల్‌రౌండర్.. భారత్‌తో సిరీస్‌కు దూరం!

ABN , Publish Date - Sep 19 , 2026 | 02:41 PM

న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అనూహ్యంగా గాయపడ్డాడు. ఓ యాడ్ షూట్‌లో భాగంగా డైవింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో అతడి కుడి భుజం డిస్‌లోకేట్ అయింది.

యాడ్ షూట్‌లో గాయపడ్డ కివీస్ ఆల్‌రౌండర్.. భారత్‌తో సిరీస్‌కు దూరం!
Rachin Ravindra

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అనూహ్యంగా గాయపడ్డాడు. ఓ యాడ్ షూట్‌లో భాగంగా డైవింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో అతడి కుడి భుజం డిస్‌లోకేట్ అయింది. క్యాచ్ కోసం వెళ్లిన రచిన్.. సేఫ్టీ మ్యాట్‌పై అనుకోకుండా ఇబ్బందికరంగా పడిపోవడంతో భుజానికి తీవ్ర గాయమైంది. అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న భారత్-న్యూజిలాండ్ సిరీస్‌కు రచిన్ రవీంద్ర దూరం కానున్నట్లు సమాచారం.


ఈ ఘటనపై న్యూజిలాండ్ క్రికెట్ పెర్ఫార్మెన్స్ మేనేజర్ మైక్ సాండిల్ స్పందించాడు. ‘ఇది నిజంగా మాకు దురదృష్టకరమైన విషయం. రచిన్‌కు ఇలా జరగడం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అతడు త్వరగా కోలుకుని మైదానంలోకి రావాలి. ఆటగాళ్లతో నిర్వహించే కమర్షియల్ షూట్లకు సంబంధించి అన్ని కార్యకలాపాలను ముందుగానే అందరి అంగీకారంతోనే నిర్వహిస్తాం. తగిన భద్రతా చర్యలు కూడా తీసుకున్నాం. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియలను మరోసారి సమీక్షిస్తాం’ అని పేర్కొన్నాడు.


భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును వచ్చే వారం ప్రకటించనున్నారు. అప్పటివరకు రచిన్ రికవరీని న్యూజిలాండ్ క్రికెట్ అధికారులు నిశితంగా పరిశీలించనున్నారు. మరోవైపు న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ కూడా రచిన్ విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశాడు. ‘రాబోయే ఆరు నెలల్లో అతడికి భారీ టెస్టు షెడ్యూల్ ఉంది. అందుకే అవసరమైన దానికంటే ముందుగానే రచిన్‌ను మైదానంలోకి తీసుకురావాలని మేం అనుకోవడం లేదు. అతడికి అత్యుత్తమ వైద్య సహాయం, రిహాబిలిటేషన్ అందుతోంది. త్వరలోనే అతడిని తిరిగి మైదానంలో చూడాలని ఎదురుచూస్తున్నాం’ అని తెలిపాడు.


ఇవీ చదవండి:

ఆసియా గేమ్స్: సెమీ ఫైనల్ గ్రౌండ్‌పై వెల్లువెత్తుతున్న ఆందోళనలు

నేటినుంచే మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌

Updated Date - Sep 19 , 2026 | 02:41 PM